తెలంగాణ: అందివచ్చిన అవకాశం బీజేపీ మిస్‌ చేసుకుంటోందా?

frame తెలంగాణ: అందివచ్చిన అవకాశం బీజేపీ మిస్‌ చేసుకుంటోందా?

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగింది. విమర్శలు.. ప్రతి విమర్శలతో పాటు మధ్య మధ్యలో పంచ్ డైలాగ్ లతో సభ దద్దరిల్లింది. గత పదేళ్లు చప్పగా సాగిన తెలంగాణ శాసన సభ ఈ సారి వాడీవేఢీ చర్చలతో దూసుకుపోయింది. ఇవన్నీ సరిపోనట్లు సవాళ్ల వర్షం కురిసింది. అధికార పక్షం వర్సెస్ విపక్షం మధ్య నడుస్తున్న సంవాదంలో సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఇక్కడ కాంగ్రెస్ అధికార పక్షం కాగా.. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. ఈ రెండు పార్టీలే కాదు ఉనికి చాటుకునేలా ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ తో పాటు సమానంగా బీజేపీకి సీట్లు వచ్చాయంటే ఆ పార్టీ కి తెలంగాణలో ఆదరణ పెరుగుతోందని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడటం చాలా అరుదుగా కనిపిస్తోంది.

ఏపీలో ఎలాగూ అధికార పక్షమే. దీంతో చేసేదేమీ లేదు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ను దాటుకొని ఓ అడుగు ముందుకు వేయాలంటే సభలో తమ ఉనికిని చాటుకోవాలి. కానీ ప్రస్తుతం ఇలాంటి సీన్లు ఏమీ అసెంబ్లీలో కనిపించడం లేదు. అసలు అసెంబ్లీ చర్చల్లో వీరు పాల్గొంటున్నారా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

అసెంబ్లీలో బీజేఎల్పీ వివిధ ముఖ్యమైన అంశాలపై ఎలాంటి వైఖరి అనుసరించాలి అనే దానిపై రాష్ట్ర నాయకత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బీజేఎల్పీ పదవి ఆశించిన సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ అప్పుడప్పుడు మాత్రమే సమావేశాలకు హాజరు అవుతున్నారు. మొత్తంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా తమ సొంత ఇమేజ్ ని నిలబెట్టుకునేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎం తమ వాయిస్ ని బలంగా వినిపిస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ మాత్రం సభలో అంటీ ముట్టనట్లుగా ఉంది. ఇది ఆ పార్టీకి మైనస్ గా మారే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: