లంచ్ సమయాన్ని వృథా చేయొద్దు? సృష్టి కార్యానికి వినియోగించుకోండి..! ఇదేం పిలుపురా బాబూ!
ప్రపంచంలోని కొన్ని దేశాలకు జనాభా పెరుగుదల సమస్యగా ఉంది. ఇంకొన్ని దేశాలకు తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు అతి పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. దీంతో ఆయా దేశాలు వారి వారి యువతకు సంతానోత్పత్తిపై దృష్టి పెట్టాలని సూచిస్తూ.. అందుకు భారీ భారీ బహుమతులను కూడా ప్రకటిస్తున్న విషయం మనకి తెలిసిందే.
ఈ విషయంలో పలు దేశాలు ఇప్పటికే వివాహాలు చేసుకోవాలని.. అనంతరం పిల్లలను కనాలని.. యువతను రిక్వెస్టులు పెడుతూ.. వరుస సెలవులు ఇస్తూ. ఆ దిశగా ఆలోచన చేయాలని కోరుతోంది. ఈ సమయంలో తాజాగా ఎలాగైన జనాభాను పెంచండి.. దేశ సేవ చేయండి అంటూ పిలుపునిస్తున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..
అవును ఓ పక్క తగ్గుతున్న జననాల రేటు. దానికి తోడు రెండున్నరేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో బలైపోతున్న యువత. మరోపక్క నిర్బంధంగా సైన్యంలో చేరాల్సి రావడంతో పెరుగుతున్న దేశాన్ని వీడేవారి సంఖ్య. వెరసి రష్యాకు జనాభా సమస్య వచ్చి పడింది. ఈ దేశంలో జనాభా గణనీయంగా తగ్గిపోతుంది.
దీంతో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆ దేశ ప్రజలకు సరికొత్త పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా.. రోఊ పని మధ్యలో లంచ్, కాఫీ బ్రేక్ టైంలో కూడా సంతానోత్పత్తి కోసం ప్రయత్నించాలని.. ఫలితంగా జనాభాను పెంచి దేశ సేవ చేయాలని పిలుపునిచ్చారు. దీంతో ఈ పిలుపుపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు.
ఇదే విషయంపై స్పందించిన రష్యా ఆరోగ్య మంత్రి యెవగనీ షెప్తోపలోవ్ రోజంతా పనిలో ఉంటున్నామనే పసలేని సాకులు చెప్పకండి.. సృష్టికార్యానికి ఆఫీసు పని ఏ మాత్రం అడ్డు కాదు. లంచ్ బ్రేక్, కాఫీ బ్రేక్ ఇలా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. కాగా జననాల రేటును పెంచడానికి రష్యా ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. అబార్షన్ నిబంధనలను అత్యంత కష్టసాధ్యంగా మార్చేసింది. తొలి కాన్పులకు ఏకంగా రూ.9.4లక్షల బహుమతిని ప్రకటించింది.