మరిది కోసం పురంధేశ్వరి అంత చేశారా?
బీజేపీతో టీడీపీకి పొత్తు కుదిర్చింది ఎవరు? అలా బీజేపీ పెద్దలను ఒప్పించింది ఎవరు? చంద్రబాబుతో కలవడానికి ఇష్టపడని బీజేపీని దారికి తెచ్చింది ఎవరు? అంటే ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు వేరే వినిపిస్తోంది. ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.
ఇది ఎవరో అన్నమాట కాదు.. స్వయంగా చంద్రబాబే పురంధేశ్వరి పేరును చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఆమె అధ్యక్షురాలిగా ఉండటం వల్లే బీజేపీ టీడీపీ కూటమిలోకి వచ్చిందని అర్థం వచ్చేలా చంద్రబాబు మాట్లాడారు. ఎన్డీయే శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పురంధేశ్వరిని ఆకాశానికి ఎత్తేశారు. చాలా గౌరవంతో మాట్లాడారు. తమది హిట్ కాంబినేషన్ అని.. పవన్ పురంధేశ్వరి సహకారంతోనే ఎన్నికల్లో ఘన విజయం సాధించామని గుర్తు చేశారు.
అయితే ఇదే చంద్రబాబుని వ్యతిరేకించి పురంధేశ్వరి కాంగ్రెస్లో చేరారు. ఆ పార్టీలో కేంద్ర మంత్రి పదవి పొందారు. అటు తర్వాత బీజేపీ లో చేరారు. ఇప్పుడు అదే చంద్రబాబు సీఎం కావడానికి దోహద పడ్డారు.
అయితే చంద్రబాబుతో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఉన్న దశాబ్దాల వైరం దృష్ట్యా.. ఆ రెండు కుటుంబాలు కలవవని భావించారు. కానీ రెండు కుటుంబాల మధ్య సయోధ్య నెలకొంది. రాకపోకలు ప్రారంభం అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే అప్పట్లోనే చంద్రబాబుని దృష్టిలో పెట్టుకొని పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించారనే ప్రచారం జరిగింది.
కానీ ఆమె ఎప్పుడు చంద్రబాబుని టార్గెట్ చేయలేదు. వైసీపీయే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించేవారు. టీడీపీ విషయంలో బీజేపీ అభిప్రాయాన్ని మార్చింది కూడా పురంధేశ్వరి అని చంద్రబాబు మాటలతో తేలిపోయింది. ఆమె కంటే ముందు అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు టీడీపీని టార్గెట్ చేసుకునేవారు. ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఆయన ఎన్నికల వరకు ఉంటే టీడీపీతో పొత్తు ఉండేది కాదన్న అభిప్రాయం పలువురిలో నెలకొంది. మొత్తానికి అయితే మరిది కోసం పురంధేశ్వరి పెద్ద సాహసమే చేశారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.