వంద రోజుల్లో బీజేపీ సాధించింది ఏమీ లేదా?

ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎనిమిది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వీరిలో కొందరు ఫైర్ బ్రాండ్లు కూడా ఉన్నారు.  విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి లాంటి సీనియర్ నేతలు ఉన్నారు. తాజాగా కూటమి సర్కారు వంద రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ఈ జోష్ టీడీపీ, జనసేనలో కనిపిస్తున్నా.. బీజేపీలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.


వాస్తవానికి సర్కారు వంద రోజుల పాలనను పండుగా చేయాలని భావించినా.. వరదలు, వర్షాల కారణంగా నామమాత్రంగా జరిపింది. కానీ రాజకీయంగా వేసిన అడుగులు, ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలపై మాత్రం కూటమి పెద్దలు చర్చించారు. ఈ క్రమంలో బీజేపీ విషయాన్ని తీసుకుంటే.. అసెంబ్లీలో ఒకరిద్దరు మాట్లాడింది మినహా.. ప్రజల మధ్య కనిపించిన బీజేపీ ఎమ్మెల్యేలు లేరనే చెప్పొచ్చు. ఒక్క మంత్రి సత్యకుమార్ యాదవ్ మాత్రం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.


అయితే వరద తగ్గిన తర్వాతే సత్యకుమార్ పర్యటించడంతో ఆయన ఆశించిన మేలు కానీ.. పేరు కానీ రాలేదు. ఇక ఎప్పుడు సమకాలిన రాజకీయాలపై మాట్లాడే విష్ణుకుమార్ రాజు కూడా.. తనకు ప్రాధాన్యం దక్కలేదన్న ఉద్దేశంతో మౌనంగా ఉంటున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కామినేని శ్రీనివాస్ సైలెంట్ మూడ్ లోనే ఉంటున్నారు. ఎవరికి వారు తమ పనుల్లో ఉన్నారే తప్ప ప్రభుత్వ పరంగా కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు.


ఇలా బీజేపీ నాయకులు వంద రోజుల్లో సాధించిన ప్రగతి అంటూ ఏమీ లేదని విశ్లేషకులు అంటున్నారు. సత్యకుమార్ మంత్రి కాబట్టి పలుమార్లు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. సౌకర్యాలపై ఆరా తీశారు. అయితే ఈయన మాత్రం వైసీపీపై నిశిత విమర్శలు చేస్తూ.. సీఎంను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన వారు మాత్రం నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు. మరి పార్టీ పరిస్థితి ఏంటనేది అధిష్ఠానం ఆలోచించుకోవాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. ఏదేమైనా వంద రోజుల పాలనలో బీజేపీ ప్రత్యేకంగా సాధించింది.. పోరాడింది అంటూ ఏమీ లేదని పలువురు పెదవి విరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: