కేసీఆర్ బయటకు రాకుంటే బీఆర్ఎస్ దుకాణం మూసేయాల్సిందేనా?

కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలు తూటాల్లా పేలుతుంటాయి. ప్రత్యర్థులు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుటాయి. అచ్చమైన తెలంగాణ మాండలికంతో చేసే కామెంట్లు ముచ్చెమటలు పట్టిస్తాయి. అన్నింటికి మించి తెలంగాణ ప్రజలకు నచ్చుతాయి. కానీ ఆ మాటలు వినబడి దాదాపు ఐదు నెలలు కావొస్తోంది. ఆయన కనిపించడం లేదు. ఆయన మాట వినిపించడం లేదు.


కారణం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని భావిస్తున్నారా? లేకుంటే వ్యూహాత్మకమా? ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. తెలంగాణ రాక ముందు ప్రత్యేక రాష్ట్రం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ తన ప్రసంగాలతో రాష్ట్ర ప్రజానీకాన్ని ఆకట్టుకోగలిగారు. ఆయన సభలో మాట్లాడుతున్నారు అంటే.. అందరూ టీవీల ముందు కూర్చోనే పరిస్థితి ఉండేది. అలా ఉద్యమం చేసే చివరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు.


ఇక రాష్ట్రం ఏర్పాటు దగ్గర నుంచి దశాబ్ధం పాటు పాలించారు. గులాబీ పార్టీకి తిరుగేలేకండా పోయింది. ఏ ఎన్నిక వచ్చినా కారు పార్టీ జెట్ స్పీడ్ లో దూసుకుపోయేది. అటు ప్రభుత్వంలోను తిరుగులేని నిర్ణయాలు తీసుకుంటూ.. ముందుకు సాగారు కేసీఆర్.


దశాబ్ద కాలం సీఎంగా ఉన్న కేసీఆర్.. మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దాంతో అప్పటి నుంచి ఆయన ప్రజల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. ఆయనకు సంబంధించిన ఫామ్ హౌజ్ లోనే కాలం గడుపుతున్నారు. నేతలతో సమీక్షలైనా.. ఎవరైనా కలవాలన్నా. అంతా అక్కడే. అంతే తప్పితే ఇప్పటి వరకు బయట కనిపించింది లేదు.


దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతుంది. కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి వస్తారా ? రారా? రాజకీయ చాణిక్యుడిగా పేరున్న ఆయన.. ప్రజల్లోకి రాకుండా ఉండటంపై పలు రకాల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు కావొస్తోంది. అయితే అధికార పార్టీ వైఫల్యాలపై కేసీఆర్ ఇప్పటి వరకు మాట్లాడింది లేదు.


ఇదిలా ఉండగా మరికొన్ని రోజుల్లో ఆయన ప్రజాక్షేత్రంలో అడుగు పెడతారు అని.. ఆయన అభిమానులు చెబుతున్నారు. కేసీఆర్  బయటకు వస్తేనే పార్టీకి పునరైభవం వస్తుందని గులాబీ నేతలు గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: