రేషన్ కార్డులు రద్దు..! మరో షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ?
తెలంగాణలో పలు ఉచిత హామీలతో పాటు.. అనేక హామీలతో 2023లో నవంబరులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ కు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై రేవంత్ సర్కారు దృష్టి సారించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500లకే గ్యాస్ పథకాన్ని అమలు చేస్తోంది.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు శ్రీకారం చుట్టింది. రైతుల పంట రుణాలు రూ.2లక్షల వరకు మాఫీ చేసింది. రైతు భరోసాకు సిద్ధం అవుతుంది. ఖరీఫ్ లో సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. హామీలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నట్లు కనిపిస్తున్న సర్కారు త్వరలో ప్రజలకు షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే విద్యుత్తు ఛార్జీల పెంపును ఈఆర్సీలు ప్రతిపాదనలు చేశాయి. దీనిపై రెండు మూడు నెలల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక తాజాగా రేషన్ కార్డులు రద్దు చేసే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కారు.
రాష్ట్రంలో సుమారు 90 లక్షల వరకు రేషన్ కార్డులు ఉన్నట్లు అంచనా.. వీటిలో సుమారు 15లక్షల రేషన్ కార్డులను రద్దు చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కార్డుదారులను గుర్తించేందుకు గత ప్రభుత్వం ఈకేవైసీ చేపట్టింది. పలుమార్లు గడువు పొడిగించింది. అయినా చాలా మంది వివిధ కారణాలతో ఈకేవైసీ చేయించకోలేదు. కొందరికి వేలిముద్రలు పడకపోవవడంతో చాలా మంది ఈకేవైసీ చేసుకోలేదు.
ఈ సమయంలో రేవంత్ సర్కారు ఈకేవైసీ చేయించుకోని వారి రేషన్ కార్డులు రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే సుమారు 15 లక్షల వరకు రేషన్ కార్డులు రద్దు అవుతాయి అని అంచనా. ఒక అక్టోబరు 2 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర జనాభా 3.83 కోట్లు. 89.96 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి.