బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ సీఎం? మోదీ పదవికి అడ్డు రాకుండా ఉండేందుకేనా?

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా స్థానంలో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ అధ్యక్ష పదవికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరును ఆర్ఎస్ఎస్ తో పాటు బీజేపీలోని పలు వర్గాలు సమర్థించినట్లు తెలుస్తోంది.


ప్రశాంతంగా ఉండే తత్వం, రాజకీయ చతురతకు తోడు అసాధారణ మీడియా మేనేజ్ మెంట్ నైపుణ్యాలు ఉన్న ఆయన బలమైన పోటీ దారుగా నిలిచారు. మూడు దశాబ్దాలుగా పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ క్లిష్టమైన సవాళ్లను సైతం ఎదుర్కోగలనని నిరూపించుకున్నారని, అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇతర నాయకుల్లో ఎవరికీ ఈ లక్షణాలు లేవని ఆర్ఎస్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఇప్పటి వరకు చర్చించిన నేతల్లో చౌహాన్ అత్యుత్తమ ఎంపిక అని.. ఆయనకున్న ప్రజాధారణకు తోడు విస్త్రృతమైన అనుభవంతో పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపాయి.


బీజేపీతో పాటు సంఘ్ తో కూడా ఆయనకున్న దశాబ్దాల నాటి అనుబంధం కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆర్ఎస్ఎస్ లో అజాత శత్రువుగా పేరొందిన శివరాజ్ సింగ్ చౌహాన్ పోరాడే తత్వం, శ్రేణుల్లో ఏకాభిప్రాయాన్ని సాధించే నేర్పు జాతీయ స్థాయిలో బీజేపీని నడిపించే నాయకుడికి ఉండాల్సిన కీలక నైపుణ్యాలని ఆర్ఎస్ఎస్ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.


ఇదిలా ఉండగా ఆయన మధ్యప్రదేశ్ సీఎంగా ఆయన సుదీర్ఘ కాలం పాటు పని చేశారు. ఆయనకు ఆ రాష్ట్రాన్ని వదిలి రావాలని లేదు. కానీ మోదీ, అమిత్‌ షా పట్టుబట్టి మరీ ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకువచ్చారని విశ్లేషకుల అంటుంటారు. వాస్తవానికి ప్రధాని కన్నా ఆయన రాజకీయ అనుభవం ఎక్కువ అని కూడా చెబుతుంటారు. గతంలోనే ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని చూసిన కొన్ని ప్రత్యేక పరిస్థితులు వల్ల ఇవ్వలేదు. ఈ సారి మాత్రం పక్కా అని జాతీయ నాయకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: