జమిలి ఎన్నికలు వస్తే జగన్ పని అవుటేనా..?

వైసీపీ జమిలి ఎన్నికలపై ఆశలు పెట్టుకుందా? రాష్ట్రంలో ముందస్తుగా ఎన్నికలు వస్తాయని భావిస్తోందా? మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏమో జమిలితో ముందస్తు ఎన్నికలు రావొచ్చేమో? ఈ కష్టాలు ఉండవేమో? అంటూ జగన్ ముందుగానే వ్యాఖ్యానించడం మనకి తెలిసిందే.


తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉండేది కేవలం రెండేళ్లు మాత్రమే నని తేల్చేశారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అయితే ఇది వినడానికి హాయిగా ఉంది? సాధ్యమేనా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. ఎందుకు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వం. రాష్ట్రంలో బీజేపీ భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం నడుస్తోంది.


కేంద్రంలో చంద్రబాబు కీకల భాగస్వామి. తప్పుకుండా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం గట్టిగానే పోరాడుతారు. ఇప్పటికే చంద్రబాబు జమిలి ఎన్నికలకు జై కొట్టారు. అంటే ఆయన వ్యూహం ఆయనకు తప్పకుండా ఉంటుంది. కేంద్రం వద్ద ఆ స్థాయిలో హామీ తీసుకోకుండా ఆయన మాట్లాడతారా?  రాజకీయంగా నష్టం జరుగుతుందని అనుకుంటే ముందస్తు ఎన్నికలకు అంగీకరించరు కదా? ఇలా ఎన్నెన్నో చిక్కుముడులు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.


దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నాది జమిలి లక్ష్యం. దీనికి ఇండియా కూటమి నుంచి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ అనేది మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో జమిలి అంటే రాజకీయ పార్టీలు అంగీకరించే పరిస్థితి లేదు.


ఇక ముందస్తు ఎన్నికలు వస్తే  తట్టుకునే స్థితిలో వైసీపీ ఉందా? మళ్లీ జగన్ కి అధికారం ఇవ్వాలని కోరితే ప్రజలు ముందుకు వస్తారా? పోనీ వైసీపీ ఏమైనా పోరాటాలు చేసిందా  అంటే సమాధానం దొరకదు. పార్టీలో సీనియర్లు అంతా సైలెంట్ అయిపోయారు. ఇంకా చాలా మంది అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. ఇన్ని సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వైసీపీ ముందస్తు ఎన్నికలు వచ్చినా ఫేస్ చేసే పరిస్థితిలో లేదని విశ్లేషకులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: