ఏపీలో ఈడీ దాడులు స్టార్ట్..? వైసీపీ ఇక ఖాళీయేనా?

బీజేపీని తెలుగుదేశానికి దగ్గర చేయడంలో అనేక మంది పాత్ర ఉంది. అందులో సీఎం రమేశ్‌ ఒకరు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కేంద్ర క్యాబినెట్లో ఆయనకు చోటు దక్కుతుందని అంతా భావించారు.  కానీ సామాజిక సమీకరణలో భాగంగా ఆయనకు అవకాశం దక్కలేదు. రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ దక్కింది.



బిజెపికి సంబంధించి నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు హైకమాండ్ మంత్రివర్గంలో చోటు ఇచ్చింది. ఎంపీగా ఉన్న సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీలో కీలకంగా మారారు. తాజాగా విశాఖ మాజీ ఎంపీ, వైసీపీ నేత వివి సత్యనారాయణను టార్గెట్ చేసుకొని ఈడి తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే.  ఇలా ఈడి ఫోకస్ చేయడం వెనక సీఎం రమేష్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.


అందుకు తగ్గట్టుగానే సీఎం రమేష్ ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. వైసిపి నేతల అక్రమ సంపాదనలపై ఈడి, సిబిఐలకు తానే ఫిర్యాదు చేశానని.. మాజీ సీఎం జగన్ తో పాటు వైసిపి అక్రమార్కుల బండారాలన్నీ బయటపడతాయని సీఎం రమేష్ ప్రకటించారు. అయితే ఉత్తరాంధ్ర పై పెత్తనానికి సీఎం రమేష్ తహతహలాడుతున్నారని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.


సీఎం రమేష్ ను అంత ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బిజెపితో తెలుగుదేశం పార్టీని కలిపింది ఆయనే. బిజెపి పెద్దలను ప్రభావితం చేసింది ఆయనేనని ఒక టాక్ ఉంది. తెలుగుదేశం పార్టీతో బిజెపి జత కట్టడం వెనుక సీఎం రమేష్ అహర్నిశలు శ్రమించారని తెలుస్తోంది. అటువంటి సీఎం రమేష్ తన ఫిర్యాదుల వల్లే ఈడీ దాడులు జరుగుతున్నాయని చెబుతుండడం విశేషం.


అయితే ఇప్పుడు వైసీపీ నేతలకు సీఎం రమేష్ నుంచి కొత్త భయం పట్టుకుంది. కేవలం విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తోనే ఈ దాడులు ఆగుతాయా? లేకుంటే ఉత్తరాంధ్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలను టార్గెట్ చేసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది వైసీపీ నేతలు సీఎం రమేష్ స్మరణ చేసుకుంటున్నారు. ఆయన ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తానికైతే ప్రత్యేక వీడియోతో సీఎం రమేష్ రేపిన కాక ఇప్పట్లో చల్లారేలా లేదు.

 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: