తెలంగాణ లో మొదలైన రెడ్ బుక్ ల కలకలం..!
ఏపీ ఎన్నికలకు ముందు నారా లోకేష్ ప్రతిసారీ మాట్లాడుతూ రెడ్ డైరీ ప్రస్తావించారు. అధికారుల పేర్లు రాసుకుంటున్నాను అధికారంలోకి వచ్చాక సంగతి చెప్తాను అంటూ ప్రతిసారి స్టేట్మెంట్ ఇచ్చాడు నారా లోకేష్. ఇప్పుడు తెలంగాణలో తాజాగా అలాంటి హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ అంటూ తెలంగాణలో ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టాడు. ప్రతి ప్రెస్ మీట్లోనూ బ్లాక్ బుక్ చూపించి అధికారులకు వార్నింగ్ ఇస్తున్నాడు.
తాజాగా తనపై డ్రగ్స్ కేసులో ఇరికించే కుట్ర జరిగిందని, అందుకు సహకరించిన పోలీసు అధికారుల పేర్లను మరోసారి బ్లాక్ బుక్ లో రాసుకున్నాను అంటూ చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని, అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లాక్ బుక్ లో ఉన్న పేర్లు ఉన్నవారికి అన్ని బ్లాక్ డేస్ అంటూ చెప్పారు.
ఇక మాజీ మంత్రి హరీష్ రావు కూడా వనపర్తి రైతు ధర్నాలో మాట్లాడుతూ.. అత్యుత్సాహం చూపిస్తున్న పోలీస్ అధికారుల పేర్లను తాను రెడ్ డైరీలో రాసుకుంటున్నాను అంటూ బహిరంగ వేదికపైనే చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరినీ వదిలిపెట్టం అన్నారు హరీష్ రావు. ఇదే బీఆర్ఎస్ పార్టీలోని ఇంకొంతమంది నేతలు రెడ్ బుక్ లో ఓవరాక్షన్ చేస్తున్న ఆఫీసర్ల పేర్లు రాసుకుంటున్నామంటూ చెబుతున్నారు. అయితే అధికారులను బెదిరించడానికా అంటే కాదని ఇంటర్నల్గా చెప్తున్నారు ప్రతిపక్ష నేతలు. కింద స్థాయి కేడర్ కి, కార్యకర్తలకి ధైర్యం నింపడం కోసమే ఇలాంటి టెక్నిక్స్ వాడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.