మోదీ కి వ్యతిరేకంగా జగన్ సంచలన నిర్ణయం? ఇక తాడో పేడో తేల్చుడేనా?

అధికారంలో ఉన్నన్నాళ్లు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వక్ఫ్‌ బిల్లుకు తాము వ్యతిరేకమని సంచలన ప్రకటన చేసింది.  దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు.


విజయవాడలోని కుమ్మరిపాలెం, ఈద్గా మైదానంలో ఆదివారం వక్ఫ్‌ పరిరక్షణ మహాసభ నిర్వహించారు. ఈ సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాశ్‌ చంద్రబోస్‌తో కలిసి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో పార్టీ పక్షనేత విజయసాయిరెడ్డి హాజరై మాట్లాడారు.  వక్ఫ్‌ బిల్లుపై సూటిగా.. స్పష్టమైన ప్రకటన చేశారు. ముస్లిం హక్కులకు భంగం కలిగే చట్టాన్ని అంగీకరించమని సంచలన ప్రకటన చేశారు.  పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో 9 అంశాలకు వ్యతిరేకంగా లేఖ రాసి జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి పంపించినట్లు వెల్లడించారు.


'వక్ఫ్‌ బిల్లును తెలుగుదేశం పార్టీ అంగీకరించింది. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు మంత్రివర్గంలో బిల్లును అంగీకరించి.. బయట లోక్‌సభలో మాత్రం బిల్లుకు సవరణలు చేయాలంటూ టీడీపీ నాటకాలు ఆడుతోంది' అని ఎంపీ విజయ సాయిరెడ్డి విమర్శించారు.  ముస్లిం హక్కులు, మనోభావాలు, సాంప్రదాయాలను కాలరాసే ఏ చట్టాలను, సవరణలను తాము అంగీకరించమని స్పష్టం చేశారు. ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా ఉన్న 8 పాయింట్లను పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఆదేశాల మేరకు వ్యతిరేకించినట్లు ప్రకటించారు.


టీడీపీ బీజేపీతో చేతులు కలిపి బిల్లును ఆమోదించడానికి ప్రయత్నం చేస్తోందని విజయ సాయిరెడ్డి తెలిపారు.  వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తే టీడీపీ మంత్రులు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని సవాల్‌ విసిరారు. ముస్లింల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు భూములను కుట్ర పూరితంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాన్ని అడ్డుకుని తీరుతామని విజయ సాయిరెడ్డి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: