కూటమి లో రాజ్య సభ లెక్క తేలడం లేదా?

ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ మూడు సీట్లూ వైసీపీ ఎంపీలు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య రాజీనామాలతో ఖాళీ అయిన ఈ సీట్లను ఎవరితో భర్తీ చేస్తారు అన్న చర్చలు ఒక వైపు సాగుతున్నాయి. మరో వైపు చూస్తే కూటమిలోని పార్టీలకు ఇందులో షేరింగ్ ఉందా అన్నది కూడా చర్చగా ఉంది.


ఈ మూడు ఎంపీ సీట్లను మూడు పార్టీలు సమానంగా పంచుకోవాలని తాజగా ప్రతిపాదనలు మిత్రుల నుంచి టీడీపీకి వెళ్తున్నాయని అంటున్నారు.  లేటెస్ట్ గా దిల్లీ వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉప ముఖ్యమంత్రి పవన్ కలిశారు.  ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ సీట్ల ప్రస్తావన వచ్చిందని కూడా ప్రచారం అయితే సాగుతోంది.  టీడీపీ లో ఈ పదవులకు పెద్ద పోటీయే ఉంది.  మాజీ ఆర్థిక మంత్రి యనమల రామక్రిష్ణుడు, అశోక్ గజపతిరాజు, కంభంపాటి రామ్మోహన్, గల్లా జయదేవ్ తో పాటు నందమూరి సుహాసిని ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి.


తాజా మాజీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు తన సీటుని తనకే మళ్లీ ఇమ్మని కోరుతున్నారని అంటున్నారు.  జనసేనకు 21 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అలాగే శాసనమండలిలో అడుగు పెట్టింది.  లోక్ సభలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో కూడా అడుగు పెడితే మొత్తం సభలలో జనసేన ఖాతా తెరచినట్లు అవుతుందని భావిస్తున్నారు.


మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ ఇవ్వాలన్న ప్రతిపాదన ఉందని అంటున్నారు. ఆయన కేంద్ర మంత్రివర్గంలో కూడా చేరే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.  బీజేపీ కూడా తమకు ఒక రాజ్యసభ సీటు ఏపీ కోటా నుంచి కోరుకుంటోంది. తమ ప్రాధాన్యత కూడా ఉండాలని భావిస్తోంది అని అంటున్నారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్ళేందుకు బిగ్ షాట్స్ కొందరు ఆసక్తిని చూపిస్తున్నారు అని అంటున్నారు.

దాంతో మూడు సీట్లూ ముగ్గురూ పంచుకోవాలన్న డిమాండ్ అయితే ఉందని ప్రచారం మాత్రం సాగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకూ నిజం ఉందో తెలియదు కానీ తొందరలో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే పూర్తి విషయం బయటకు వస్తుందని అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: