జగన్ దెబ్బతో రాజకీయాలు వదిలేస్తున్న వైసీపీ నేతలు? పార్టీ పరిస్థితి ఏంటో?
ఏపీలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలు కలవరపెడుతున్నాయి. ఆ పార్టీ నేతలు వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు.
దశాబ్దాలుగా రాజకీయాలు చేసిన వారు సైతం సైలెంట్ అవుతున్నారు. వేరే పార్టీలో అవకాశం లేకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. అయితే పొలిటికల్ జంక్షన్ లో ఉంటాం కానీ.. వైసీపీలో ఉండలేమని తేల్చి చెబుతున్నారు. అధినేత జగన్ తీరు నచ్చక ఎక్కువమంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. మరో పార్టీలో అవకాశం లేక వైరాగ్యం ప్రకటిస్తున్నారు. రాజకీయాలనుంచి తప్పుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న వారు కొనసాగేందుకు ఇష్టపడడం లేదు. అలాగని వేరే పార్టీలో అవకాశం చిక్కడం లేదు. అటువంటి వారంతా రాజకీయాలకు దూరం అని ఒక ప్రకటన ఇస్తున్నారు. దీంతో వైసీపీలో ఏం జరుగుతోంది అన్న ప్రశ్న వినిపిస్తోంది. అధినేత జగన్ తీరు నచ్చక ఎక్కువమంది బయటపడుతున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ఓడిపోయిన వెంటనే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఎన్నికల ముందే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చారు. అనవసరంగా తప్పు చేశానన్న బాధతో ఆయన ఏకంగా రాజకీయాలనుంచి తప్పుకున్నారు. మరోవైపు వైసీపీ ఆవిర్భావం నుంచి వెంట నడిచిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సైతంవైసీపీకి దండం పెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన పదవీకాలం పూర్తయితే రాజకీయాలనుంచి నిష్క్రమించాలని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా రాజకీయాలనుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. ఓడిపోయిన నాటి నుంచి ఆయన తన కార్యాలయానికి మాత్రమే పరిమితం అయ్యారు.
తాజాగా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నేరుగా అధినేత జగన్ వద్దే ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో తొలి మూడేళ్లు రాష్ట్ర హోం శాఖ మంత్రిగా సుచరిత వ్యవహరించారు. విస్తరణలో ఆమె పదవి నుంచి తొలగించారు జగన్. ఈ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి కాకుండా తాడికొండ నుంచి బరిలో దిగారు. భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. జనసేనలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు రాజకీయాల నుంచి వైదొలగాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో ఉండడం కంటే రాజకీయాలను తప్పుకోవడమే మేలన్న నిర్ణయానికి ఆ పార్టీ శ్రేణులు వస్తున్నాయి. దీంతో ఒక రకమైన గందరగోళం కనిపిస్తుంది.