ఓడించిన సామాజిక వర్గానికి దగ్గర అవుతున్న బీఆర్ఎస్? రేవంత్ లో భయం స్టార్ట్ అయిందా?
బీఆర్ఎస్పై గత కొంతకాలంగా గిరిజనులు గుర్రుగా ఉన్నారు. బంజారాహిల్స్‌లోని బంజారా, ఆదివాసీ భవనాలను పార్టీ అధినేత కేసీఆర్(KCR) ప్రారంభించి గిరిజనులకు హామీలు కురిపించారు. గిరిజనులకు ఐదారు శాతం నుంచి 10 శాతం వరకు రిజర్వేషన్లు పెంచుతానని, గిరిజన బంధు అమలు చేస్తామని, పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని, భూములు లేని వారికి పోడు భూములు పంచుతామని హామీ ఇచ్చారు. కానీ, అవన్నీ అమలుకు నోచలేదు.
10శాతం రిజర్వేషన్ పెంచుతూ జీవో జారీ చేసినప్పటికీ కేంద్రం నుంచి స్పష్టత రాలేదు. రాష్ట్రంలో రిజర్వేషన్ పెంచినా అమలులో సాధ్యం కాలేదు. దీంతో గిరిజనులు గత కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహించారు. దీంతో గత శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు వేయలేదని పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యనించారు. వారు దూరం కావడంతోనే చాలా నియోజకవర్గాల్లో ఓటమిని చవిచూశామని పేర్కొన్నారు.
నామినేటెడ్, కార్పొరేషన్లతో పాటూ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులకు టికెట్లు ఇచ్చినప్పటికీ ఆ వర్గం నుంచి సరైన రెస్పాన్స్ రాలేదని పార్టీ నేతలే అభిప్రాయపడ్డారు. కేవలం1.8 శాతం ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ చాలా సీట్లు కోల్పోంది. అందులోనూ గిరిజన ఓట్లే ఎఫెక్ట్ అని తేలింది. అందుకే వారికి దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్ మళ్లీ వ్యూహాలను రచిస్తోంది.
లగచర్ల భూ సేకరణలో ఎక్కువగా గిరిజనుల భూములే పోతున్నాయి. వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తుండటంతో అక్కడి ప్రజలు ససేమీరా అంటున్నారు. ఈ దాడి ఘటనలో గిరిజన రైతులపై కేసు నమోదు చేయడంతో పాటు జైలుకు తరలించారు. దీంతో సంగారెడ్డి జైలులో రైతుల పరామర్శకు కేటీఆర్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ నుంచి బృందం వెళ్లింది. గిరిజన నాయకులను ముందుంచి ఆ వర్గానికి దగ్గర అయ్యేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వారి పక్షాన న్యాయస్థానాల్లోనూ కొట్లాడుతామని ఇప్పటికే పార్టీ ప్రకటించింది. వీటన్నింటితో గిరిజనులకు దగ్గర కావాలని పార్టీ భావిస్తున్నది.