ఈ సారి అధికారం పక్కా వైసీపీదేనా? అందుకే జగన్ లో అంత ధీమానా?
ఏపీ పాలిటిక్స్ లో చూస్తే వరసగా ఒకరికి రెండు సార్లు అధికారం ఇవ్వడం లేదు. 2014లో టీడీపీకి అధికారం అప్పగించిన ప్రజలు 2019లో ఆ పార్టీకి ఓడించారు. కేవలం 23 సీట్లకే పరిమితం చేశారు. నిజంగా టీడీపీ అంత తప్పు ఏమి చేసింది అన్నది విశ్లేషకులకు అర్థం కాలేదు.
2024లో ఫలితాలు చూస్తే వైసీపీకి దిమ్మదిరిగేలా వచ్చాయి. టీడీపీకి 23 ఇస్తే అందులో సగం అన్నట్లుగా కేవలం 11 సీట్లను మాత్రమే వైసీపీకి ఇచ్చారు. వైసీపీ సంక్షేమ పధకాలను మాత్రం అమలు చేస్తూ పోయింది. మరి వాటిని జనాలు గుర్తు పెట్టుకుంటే ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు అయినా ఇవ్వలేకపోయారా అని అంతా అనుకున్నారు. ఈ రకమైన రిజల్ట్ ని ఎవరూ అసలు ఊహించలేదు. దీనిని పరిశీలించిన వారికి ఏపీలో ప్రజల ఆశలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయని అంటున్నారు.
అంతే కాదు తమిళనాడులో మాదిరిగా ఏపీ ఓటర్లు కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అంటే ఒకసారి గెలిచిన పార్టీని మరోసారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం చేస్తున్నారు. గడచిన మూడు ఎన్నికల్లో వచ్చిన తీర్పు రూపంలో ప్రతిఫలిస్తోంది అని అంటున్నారు. దీని మీద వైసీపీకి చెందిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విశ్లేషిస్తూ ప్రజల ఆశలను ఏ ప్రభుత్వం మ్యాచ్ చేయలేకపోతోంది అని అన్నారు.
ఆ విధంగా చూస్తే 2029 ఎన్నికల్లో టీడీపీ కూటమి ఎంత బాగా చేసింది అన్నది క్రెడిటేరియాగానే ఉండదని జనాలు మార్పు కోరుకుంటే వైసీపీకే కచ్చితంగా అధికారం దక్కుతుందని ఆయన అంటున్నారు. అయితే ఇదే రకమైన ఆలోచనలలో వైసీపీ అధినాయకత్వం కూడా ఉందని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు విరక్తి కలిగితే వెంటనే అందుబాటులో ఉన్నది వైసీపీనే అని అధినాయకత్వం భావిస్తోంది.
అందుకే అయిదేళ్ల పాటు తాము విపక్ష పార్టీగా కనిపిస్తే చాలు అని జనాలు వరమాల తెచ్చి తమ మెడలోనే వేస్తారు అని భావిస్తోంది. కానీ అలా జరుగుతుందా అన్నది కూడా చూడాలని అంటున్నారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకున్నా కూడా అది వైసీపీకి అనుకూలం అవుతుందా అన్నది కూడా ఆలోచించాలని అంటున్నారు.