మరోసారి నాగబాబు త్యాగం చేయక తప్పదా? ట్విస్ట్ ఇచ్చిన మోదీ?
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు స్థానాలకు కూటమి నుంచి అభ్యర్ధుల ఎంపిక పైన దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. రాజీనామా చేసిన ముగ్గురూ బీసీ వర్గానికి చెందిన వారు కావటంతో కూటమి నేతలు ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. తొలుత నాగబాబు రాజ్యసభ ఖాయమని భావించినా.. ఢిల్లీ జోక్యంతో ఏపీ నుంచి ఎంపికయ్యే సభ్యుల విషయంలో కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చాయి.
గత ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తొలుత భావించినా.. బీజేపీ అభ్యర్ధనతో ఆ సీటు సీఎం రమేశ్ కు కేటాయించారు. దీంతో, నాగబాబుకు రాజ్యసభ ఖాయమని భావించారు. అయితే, ఇప్పుడు కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
మూడు స్థానాల్లో బీదా మస్తానరావుకు తిరిగి టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయటం ఖాయమైంది.. టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే స్థానాన్ని కంభంపాటి రామ్మోహన్ సైతం ఆశిస్తున్నారు. అదే విధంగా సానా సతీశ్ పేరు ప్రముఖంగా రేసులోకి వచ్చింది. అటు టీడీపీ, జనసేన ముఖ్య నేతల నుంచి సానా సతీశ్ కు మద్దతు లభిస్తోంది.
నాగబాబు లేదా సానా సతీశ్ లో ఒకరు జనసేన కోటాలో ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. సానా సతీశ్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి బీజేపీ ముఖ్యుల నుంచి కీలక వర్తమానం అందినట్లు సమాచారం. బీజేపీ నుంచి తొలుత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపించింది. అయితే, ఢిల్లీ నేతలు తాజాగా కేంద్ర మంత్రివర్గం లోని ఒక నేత పేరు సూచించినట్లు సమాచారం. రాజ్యసభ కాలపరిమితి ముగియనున్న ఆ మంత్రికి ఏపీ నుంచి అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు, పవన్ సైతం ఆమోదం తెలిపారు. చివరి నిమిషంలో సమీకరణాలు మారితే తప్ప నాగబాబు పేరు ఖాయమయ్యే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.