కాంగ్రెస్ విజయోత్సవాలు సరే..! ప్రజలు అంగీకరిస్తారా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు. కానీ.. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టడానికి దశాబ్ద కాలం పట్టింది. డిసెంబర్ 9 వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కానుంది. ఇదే క్రమంలో ఏడాది సంబరాలు మాత్రం ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. 'ప్రజాపాలన – విజయోత్సవాలు 2024' పేరిట ఈ మేరకు షెడ్యూల్ సైతం రిలీజ్ చేసింది.
వచ్చేనెల 1న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్స్ 2వ దశకు శంకుస్థాపన చేయనున్నారు. విద్యార్థులకు వ్యాసరచన, సీఎం కప్ పోటీలు నిర్వహిస్తారు. 2న 16 నర్సింగ్, 28 పారా మెడికల్ కాలేజీలు, 213 కొత్త అంబులెన్సులు, 33 ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లు ప్రారంభిస్తారు. 3న హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలు, ఆరాంఘర్-జూపార్ ఫ్లైఓవర్ ప్రారంభిస్తారు. అలాగే.. కేబీఆర్ పార్క్ వద్ద జంక్షన్ల పనులకు శ్రీకారం చుడుతారు. 4న ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. వృక్ష పరిచయ కేంద్రం ప్రారంభిస్తారు. దాంతోపాటే ఉద్యోగాలకు ఎంపికైన 9,007 మందికి నియామక పత్రాలు అందిస్తారు.
5న ఇందిరా మహిళాశక్తి బజార్ ప్రారంభిస్తారు. స్వయం సహాయక గ్రూపులతో చర్చలు, మేడ్చల్, మల్లేపల్లి, నల్లగొండలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభం ఉంటుంది. 6న యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభిస్తారు. 7న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం ఉంటుంది. 8న 7 ఏఐ ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. 130 కొత్త మీ సేవలు ప్రారంభిస్తారు. ఏఐ సిటీకి భూమి పూజ ఉంటుంది. స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తారు. 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ట్యాంక్‌బండ్‌పై ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. డ్రోన్‌షో, ఆర్ట్ గ్యాలరీ, వివిధ స్టాళ్ల ఏర్పాటు చేస్తారు.
ఇంతవరకు బాగానే ఉన్నా విజయోత్సవాలు ప్రజలు ఏ మేరకు అంగీకరిస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. విజయోత్సవాల్లోనూ అభివృద్ధి పనుల ప్రారంభానికే ప్రాధాన్యం ఇచ్చారు. భజన కార్యక్రమాలు కాకుండా.. శంకుస్థాపనలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అందులోనూ బడుగు, బలహీనవర్గాలకు అవసరమైన పనులే ప్రారంభిస్తున్నారు. కేవలం చివరి రోజు మాత్రమే వేడుకలు జరుపుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం సైతం తమపై వ్యవస్థీకృత వ్యతిరేకత ప్రచారం జరుగుతున్నట్లుగా గుర్తించింది. దానిని తిప్పికొట్టేందుకు ఈ తరహా కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రభుత్వంవర్గాల నుంచి టాక్. ఈ సంబరాలు, అభివృద్ధి పనుల ద్వారా ప్రజల్లోని నెగెటివిటిని తొలగించాలన్న ప్రయత్నం చేస్తున్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుకలను ప్రజలు ఏ మేరకు ఓన్ చేసుకుంటారో చూద్దాం