బీజేపీకి షిండే షాక్ ? మళ్లీ సొంత గూటికి చేరుతున్నారా?
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బహుశా ఏ రాష్ట్రంలోనూ ఇన్ని రోజులు ఆలస్యంగా పదవీ ప్రమాణ స్వీకారం జరిగి ఉండదు. 288 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీనే 132 సీట్లు సాధించింది. సాధారణ మెజారిటీకి ఇది 13 మాత్రమే తక్కువ. అయితే, ఇంకా సీఎం ఎవరనేది తేలలేదు. అత్యధిక సీట్లు సాధించిన బీజేపీనే సహజంగా ఆ పదవిని తీసుకుంటుంది. పైగా మహారాష్ట్ర వారికి అత్యంత కీలకం.
కానీ, రెండున్నరేళ్ల కిందట ఉమ్మడి శివసేనను చీల్చిన ఏక్ నాథ్ శిందే కు సీఎం పదవి ఇచ్చింది. ఆయన సారథ్యంలోనే మహాయుతిగా ఎన్నికలకు వెళ్లి గెలిచింది. దీంతో శిందే తనకు మరోసారి కీలక బాధ్యతలు కోరుతున్నారు. అయితే, అది సీఎం పదవా? హోం శాఖతో కలిసిన డిప్యూటీ సీఎం పదవా? అనేది తేలడం లేదు.
మహారాష్ట్ర రాజకీయాల్లో శిందే వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న శిందే మహా యుతి కూటమి ముఖ్య నాయకుల సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. దీనిపై శివసేన నేత సంజయ్ శిర్సాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వంలో శిందేను పక్కనబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. హోం శాఖను డిప్యూటీ సీఎంకే ఇస్తారని.. ఇప్పుడు బీజేపీ సీఎం పదవి తీసుకుంటే.. హోం శాఖను శివ సేనకు ఇవ్వాలని.. కానీ, తమవద్దే ఉంచుకోవాలని బీజేపీ చూస్తోందని పేర్కొన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నా ప్రకటన వెలువడలేదు. కొన్ని రోజుల కిందట కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో శిందే సమావేశం అయ్యారు. బీజేపీ తీసుకునే నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ముంబైలో కూటమి నాయకుల చర్చల తర్వాత రెండు, మూడు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తామని కూడా తెలిపారు. కానీ, అలా చెప్పిన కొన్ని గంటలకే సమావేశాన్నే రద్దు చేసి సతారా జిల్లాలోని సొంతూరు వెళ్లిపోయారు. సీఎం ఎంపిక, శాఖల కేటాయింపులో ఆయన అసంతృప్తిగా ఉన్నారనే కథనాలు వస్తున్నాయి.
శిందే ఉన్నపళంగా సొంతూరుకు వెళ్లడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, విశ్రాంతి కోసమే సమావేశం రద్దు చేశారని కథనాలు వస్తున్నాయి. కానీ, మళ్లీ సీఎం పదవి దక్కడం లేదన్న నిరాశతో ఉన్నారని మరికొందరు చెబుతున్నారు. షాతో కూడా తీవ్ర జ్వరంతోనే సమావేశంలో పాల్గొన్నారని పేర్కొంటున్నారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు సొంతూరు వెళ్లడం ఆయనకు ఉన్న అలవాటుగా ఇంకొందరు తెలిపారు. మరి ఇందులో ఏది నిజమో? కాగా, ఇటీవల శిందే మహాయుతి నుంచి వైదొలగుతారనే కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, కేంద్రంలో మోదీ-షా, రాష్ట్రంలో ఫడణవీస్-అజిత్ పవార్ వంటి బలమైన శక్తులు ఉండగా అంత పనిచేస్తారని భావించలేం.