హైడ్రా పై రేవంత్ వెనక్కి తగ్గారా..! ఇక అది ముగిసిన అధ్యాయమేనా?
హైడ్రాతో ఒక్కసారిగా హైద్రాబాద్ వాసులతో సహా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను, మీడియాను తన వైపు తిప్పుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కినేని నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైన రేవంత్ సర్కార్ హైడ్రా ఆట మూసి సుందరీకరణ వద్దకు వచ్చి ఆగింది. అయితే హైడ్రా ఇప్పుడు గతం మాదిరి దుందుడుకుగా ముందుకు వెళ్లలేకపోతుంది. దీనికి అక్కడ ప్రజల నుంచి ప్రభుత్వం పట్ల వస్తున్న తీవ్ర వ్యతిరేకత ఒక కారణం అయితే, వీరంతా తమ ఆస్తుల రక్షణకు బిఆర్ఎస్ సాయం కోరడం మరో కారణంగా చెప్పవచ్చు.
సున్నపు చెరువు, దుండిగల్ లోని మల్లం పేట, వేముల వాడ, పటేల్ గూడా, మాదాపూర్ లోని కావూరి హిల్స్ పార్క్ ఇలా అనేక ప్రాంతాలలో హైడ్రా దూకుడుగా ముందుకెళ్లింది. అనుకున్నట్టుగానే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చివేయగలిగింది. బాధితులుగా రోడ్డుపాలైన వారు మాత్రం తమకు ప్రభుత్వం ఎటువంటి పునరావాసాన్ని కానీ, ఆర్థిక సాయాన్ని కానీ ప్రకటించకుండానే ఇలా ఉన్న పళంగా కూల్చివేతలకు ఆదేశాలు ఇవ్వడం అమానుషం అంటూ రేవంత్ సర్కార్ మీద మండిపడ్డారు.
బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని, లేదంటే స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి తగిన ఆర్థిక సాయమందిస్తామని హామీలు గుప్పించిన మూసి ప్రజలను ఒప్పించలేకపోయింది రేవంత్ సర్కార్. అలాగే బిఆర్ఎస్ కీలక నేత మల్లారెడ్డి కి సంబంధించిన ఆస్తులు, కేటీఆర్ ఫామ్ హౌస్, ఎంఐఎం ఒవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజీ నిర్మాణాలు సైతం అక్రమ నిర్మాణాలే అంటూ ప్రచారం జరిగింది.
అలాగే వాటికి కూడా త్వరలో హైడ్రా ట్రీట్మెంట్ తప్పదు అంటూ ఊకదంపుడు ప్రకటనలు చేసిన కాంగ్రెస్ నేతలు కానీ, హైడ్రా అధికారులు కానీ ఇప్పటి వరకు ఆ ఆస్తుల జోలికి వెళ్లే సాహసం కూడా చేయలేకపోయారు.
అప్పుడు సునామి మాదిరి ఒక్కసారిగా వచ్చి కూల్చివేతలతో విరుచుకు పడిన హైడ్రా ఇప్పుడు సప్పుడు చేయకపోవడంతో హైడ్రా ఇక ముగిసిన అధ్యాయమేనా.? అనే సందేహం కలుగుతుంది.