జగన్ బెయిల్ రద్దు అవుతుందా? కేసులపై సుప్రీం కోర్టు ఆరా?
మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కేసుల విచారణ ఆలస్యం అవుతోందని ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ విచారణ సమయంలో జగన్ కేసుల వివరాల పైన సుప్రీంకోర్టు ఆరా తీసింది. జగన్ కేసులకు సంబంధించి విచారణ వివరాలను రెండు వారాల్లో సమర్పించాలని ఈడీ, సీబీఐ ని న్యాయస్థానం ఆదేశించింది. అదే విధంగా కోర్టులో ఏ దశలో ఉన్నాయో వివరాలు కోరింది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఆలస్యం అవుతోందని రఘురామ రాజు పిటీషన్ దాఖలు చేసారు. దీంతో పాటు జగన్ బెయిల్ రద్దు చేయాలని.. హైదరాబాద్ సీబీఐ కోర్టులో జరుగుతున్న కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. దీని పైన సుప్రీంకోర్టులో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ ఇన్నాళ్లు ఎందుకు తీసుకుంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. రోజు వారీ పద్దతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు నిర్ణయించిందని ఇరు పక్షాలు సుప్రీం ధర్మాసనంకు నివేదించాయి. రోజూ వారీ విచారణకు ఆదేశించినా ఎక్కడ ఆటంకం కలుగుతుందని ధర్మాసనం ప్రశ్నించింది.
డిశ్చార్జ్, వాయిదా పిటీషన్లు, ఉన్నత కోర్టుల్లో విచారణే ఆలస్యానికి కారణమని న్యాయవాదులు వివరించారు. పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను పట్టిక రూపంలో ఇవ్వాలని సూచించింది. అఫిడవిట్ రూపంలో ఇచ్చిన పట్టిక చూసిన తరువాత తగిన ఆదేశాలు ఇస్తామని కోర్టు పేర్కొంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ట్రయల్ కోర్టు, పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 13కి వాయిదా వేసింది.
కాగా ఇటీవల సీజేఐ బెంచ్ లోని న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అన్న సంగతి తెలిసిందే. దీంతో సీజేఐ జస్టిస్ ఖన్నా ఈ పిటిషన్ విచారణను మరో బెంచ్ కి మార్చారు. ఈ నేపథ్యంలో జస్టిస్ అభయ్ ఓకా సీబీఐ, ఈడీలకు ఆదేశాలు జారీ చేశారు.