ఓర్నీ.. భూకంపాలకు కాళేశ్వరం కారణం అంట..? శాస్త్రవేత్త కామెంట్స్ వైరల్..!
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం 7:27 గంటల ప్రాంతంలో పలు చోట్ల భూమి కంపించింది. ములుగులో 5.3 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఈ సమయంలో ఈ భూకంపాలపై శాస్త్రవేత్తలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్లుగా సంభవించిన భూకంపాల్లో ఏటా దాదాపు ఒకే ప్రాంతంలో.. ములుగు చుట్టుపక్కల భూమి కంపించడాన్ని గుర్తించినట్లు నిపుణులు పేర్కొన్నారు. గత భూకంపాలతో పోలిస్తే రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత ఎక్కువని పేర్కొన్నారు. 2021లో గడ్చిరోలి సమీపంలో 4.0 తీవ్రతతో భూమి కంపించగా.. 2022లో 3.8, 2023లో భద్రాద్రిలో 3.6 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. తాజాగా భూకంప తీవ్ర 5.3గా నమోదైంది!
భూ ప్రకంపనలపై నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్.జీ.ఆర్.ఐ.) రిటైర్డ్ శాస్త్రవేత్త పూర్ణచంద్ర రావు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం లేదని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం గతంలోనూ భూకంపాలు సంభవించాయని.. ప్రధానంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో భూమి లోపల పగుళ్లు ఏర్పడతాయని.. వాటి సర్ధుబాటు వల్ల అప్పుడప్పుడూ భూకంపాలు వస్తాయని అన్నారు.
తాజాగా సంభవించిన భూకంపంలో ప్రధాన కంపనం పూర్తయ్యిందని.. దీనితో పాటు ఇంకా చిన్న చిన్న కంపాలు వస్తే రావొచ్చని అన్నారు. 5.3 తీవ్రతవల్ల పెద్దగా డ్యామేజీ కాదనే తాను భావిస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ వరంగల్, ఖమ్మం, భద్రాచలం ప్రాంతాల్లో గతంలోనూ భూకంపాలు వచ్చాయని తెలిపారు.
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన భూకంపానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ సైతం ఓ కారణం అని సీనియర్ భూగర్భ శాస్త్రవేత్త బీవీ సుబ్బారావు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వాటర్ స్టోర్ చేయడం వల్ల ఒత్తిడి పెరిగి, ఇటువంటివి సంభవిస్తాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన ప్రాంతం మొత్తం డిజాస్టర్ కు అనుకూలంగా ఉంటుందని అన్నారు.
ఈ విషయాన్ని కేంద్రం సైతం వెల్లడించిందని చెబుతున్నారని చెప్పిన సుబ్బారావు... కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భూమిలో నీరు బాగా పెరిగిందని.. ఎప్పుడైతే భూమిలో నీరు పెరుగుతుందో.. అప్పుడు భూమిలోపల ఫలకాల మధ్య కదలికలు తేలిక అవుతాయని.. ఫలితంగా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.