ఈ సారి వైసీపీ పొత్తులతో రావలసిందే నా? సింగిల్ గా అయితే కష్టమేనా?
ఏపీలో సింగిల్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీయే. దేశంలో సింగిల్ గా పోటీ చేసిన పార్టీ ఇటీవల కాలంలో కనిపించదు. పార్టీలు ఎవరు పెట్టినా అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. అదేంటో తెలియదు కానీ వైసీపీకి పొత్తులు అంటే గిట్టదన్న ప్రచారం సాగింది.
ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నీకలలో వైసీపీ సోలోగా బరిలోకి దిగినా ఆయా రాజకీయ పరిస్థితులే వైసీపీని ముందంజలో నిలబెట్టాయి తప్ప మరోటి కాదు. 2024 ఎన్నికల్లో వైసీపీ సోలోగా పోటీ చేసి ఓటమి పాలు అయింది. 2029 నాటికి వైసీపీ పోటీ చేయడం అంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నపుడు చేసిన పెర్ఫార్మెన్స్ తో పాటు అన్నీ మళ్లీ చూస్తారు.
వైసీపీకి ఎలాంటి ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయ్యే చాన్స్ లేని వేళ కచ్చితంగా పొత్తుల వైపు చూడాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. వైసీపీలోనూ పొత్తులతో వెళ్తే బెటర్ అన్న చర్చ అయితే ఉందని కూడా అంటూ వస్తున్నారు. టీడీపీ కూటమిలో బీజేపీ జనసేన ఉన్నాయి. దాంతో బలంగా ఆ వైపు ఉంది. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఇబ్బందులు తప్పవన్న చర్చ ఉంది. కూటమికి వ్యతిరేకంగా విపక్షంలో ఉన్న వైసీపీ కూడా కూటమిని ఒక దానిని ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే కచ్చితంగా ఉందని కూడా అంటున్నారు.
ఈ క్రమంలో ఆ పార్టీ కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డి పొత్తులో విషయంలో సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ పొత్తుల గురించి జగన్ డిసైడ్ చేస్తారు అన్నారు. పొత్తుల ఎత్తులు ఏవో వైసీపీ హై కమాండ్ కి ఉన్నట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు.
లేకపోతే పొత్తుల విషయంలో పూర్తిగా కొట్టి పారేసేవారు అని కూడా అంటున్నారు. అయితే ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. ఏపీలో కాంగ్రెస్ వామపక్షాలు విపక్షంలో ఉన్నాయి. వైసీపీ అయితే ఎవరితో పొత్తుకు సిద్ధపడుతుందన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా ఎన్నికల ముందే పొత్తుల విషయం చర్చకు వస్తుంది కాబట్టి అప్పటిదాకా ఈ అంశంలో ఎవరి ఆలోచనలు వారు చేసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు.