రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్‌ బాటలోనే.. ఇదేం ప్రజాపాలన?

కాంగ్రెస్‌ సర్కారు గత ఎన్నికల్లో గెలిచిందే ప్రజా పాలన నినాదంతో. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సర్కారుపై ప్రజలకు కోపం వచ్చింది కూడా పరిపాలన బాగోలేదని కాదు.. కేసీఆర్‌ దొరతనం నచ్చలేకపోవడం వల్లనే. తాను, తన కుటుంబానికే అధికారం ఉండటం.. ఇష్టానుసారం ఓ రాజులా పాలన చేయడం.. నెలల తరబడి ఫామ్‌ హౌస్‌లోనే ఉండిపోవడం.. వంటి రాజరికపు పోకడలే కేసీఆర్‌ను గత ఎన్నికల్లో దెబ్బ తీశాయి.

అదే సమయంలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు.. ప్రజాపాలన నినాదం, నిరుద్యోగుల్లో అసంతృప్తి.. బీఆర్‌ఎస్ సిట్టింపులపై ఉన్న ఆగ్రహం.. అన్నీ కలసి వచ్చి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చాయి. అయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పోకడలు పోతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం మూడు బిల్లులను సభలో ప్రవేశ పెట్టి.. నిమిషాల వ్యవధిలో ఆమోదించుకోవడం కూడా కేసీఆర్‌ పోకడలకు నిదర్శనంగా కనిపిస్తోంది.

ప్రజాస్వామ్యంలో ఏదైనా కొత్త చట్టం తెచ్చేముందు.. అసెంబ్లీలో చర్చ జరగాలి. అన్ని పార్టీలు దానిపై మాట్లాడాలి. లోటుపాట్లు చెబితే సరిదిద్దుకోవాలి. అప్పుడు బిల్లు ఆమోదంతో చట్టంగా మారాలి. కానీ.. నిన్న ప్రవేశ పెట్టిన మూడు బిల్లులను కాంగ్రెస్ సర్కారు ఏకపక్షంగా ఎలాంటి చర్చల లేకుండానే ఆమోదించుకుంది. క్రీడా యూనివర్శిటీ బిల్లు, యూనివర్శిటీల చట్టం సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులు ఎలాంటి చర్చ లేకుండానే అసెంబ్లీ ఆమోదం పొందేశాయి.

సంబంధిత మంత్రి బిల్లును ప్రవేశపెట్టడం.. దానిపై ఎలాంటి చర్చ లేకుండానే ఓటింగ్‌ జరగడం.. అది కూడా మూజువాణి పద్దతిలో ఓటింగ్ జరగడం.. బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్‌ ప్రకటించడం జరిగిపోయాయి. వాస్తవానికి ఆ కొత్త చట్టాలు కూడా ఉపయోగకరమైనవే. క్రీడా బిల్లును ఏ పార్టీ కూడా తప్పుబట్టదు. అలాగే జీఎస్టీ సవరణ బిల్లులో ఏముందో సభ్యులకు తెలియదు. ఆ బిల్లు ఎలాంటిదన్నది కాకుండా దాన్ని ఆమోదించుకున్న తీరే ప్రజాపాలన అని పాలకులు చెప్పుకుంటున్నంత ప్రజాస్వామ్యయుతంగా లేదన్న విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: