చంద్రబాబు అరెస్టు తెచ్చిన కష్టం...? ఆ అధికారిని వదలడం లేదుగా?
చంద్రబాబును గతంలో అరెస్టు చేసిన సీఐడీ మాజీ డీజీ సంజయ్ కు చిక్కులు ఎక్కువయ్యాయి. అవినీతి ఆరోపణలపై సస్పెన్షన్లో ఉన్న ఆయన ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో మాజీ డీజీ అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో సీఐడీ చీఫ్, ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉండగా, ఆయన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది.
సంజయ్ పై విచారణ జరపాలని ఏసీబీని ఆదేశించింది. అవినీతి నిరోధక చట్టం 17ఏ ప్రకారం ఒక ప్రభుత్వ అధికారిపై విచారణ జరపాలంటే ఆయనను తొలగించే అధికారం ఉన్న అధికారి అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో డీజీ స్థాయి అధికారిని విచారించాలంటే ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఏసీబీ లేఖ రాయడంతో సంజయ్ ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో సంజయ్ పై ఉచ్చుబిగించేందుకు ఏసీబీకి లైన్ క్లియర్ అయినట్లైంది.
అంతేకాకుండా విజయవాడ దాటి వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించింది. తాజా ప్రభుత్వ ఆదేశాలతో ఏసీబీ అధికారులు సంజయ్ ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గత ప్రభుత్వంలో ఫైర్ సర్వీసెస్ డీజీగా పనిచేసిన సంజయ్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. అగ్ని పోర్టల్ ఎన్వోసీలు, హార్డ్ వేర్ సరఫరా కోసం రూ.2.29 కోట్లకు సౌత్రికా టెక్నాలజీ అండ్ ప్రైవేటు లిమిటెడ్ తో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో సదరు కంపెనీకి ముందుగా రూ.59.93 లక్షలు చెల్లించారని, నెల రోజుల్లో కేవలం 14 శాతం ప్రాజెక్టు పనులు మాత్రమే పూర్తి చేశారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మైక్రోసాఫ్ట్ లాప్ ట్యాప్, యాపిల్ ఐ ప్యాడ్ వంటి ఖరీదైన ఎలక్ట్రానిక్స్ ను నేరుగా కొనుగోలు చేశారని గుర్తించింది. టెండర్ లేకుండా ఇలా నేరుగా కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వానికి 17.89 లక్షల నష్టం వాటిల్లినట్లు గుర్తించారు.
గత ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్టు సమయంలో సంజయ్ కీలకపాత్ర పోషించారు. విచారణకు పిలవకుండానే అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అప్పటి అడ్వకేట్ జనరల్ పొన్నవోలుతో కలిసి విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్లు నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు ఆదేశాలివ్వడమే కాకుండా మీడియా సమావేశాలు నిర్వహించడంతో విమర్శలు పాలయ్యారు. నాటి యాక్షన్ కు కొనసాగింపుగానే ఇప్పుడు ఆయనపై రియాక్షన్ ఉంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.