డేంజర్ బెల్స్.. రానున్న కాలంలో మన భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా..?
ప్రపంచ వ్యాప్తంగా 'గ్లోబల్ వార్మింగ్' ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాబోయే మరికొన్ని సంవత్సరాల్లో పెరుగుతున్న ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా, తీవ్రతను బట్టి దేశవ్యాప్తంగా తీవ్ర వరదలు, కరువు కాటకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు తీవ్రమైన కరవులను ఎదుర్కొంటాయి. మరికొన్ని రాష్ట్రాలు తీవ్రమైన వరదల ముప్పును ఎదుర్కొంటాయి.
బెంగళూరులోని ఐఐటి గువాహటి, ఐఐటి మండి, సిఎస్‌టిఇపి (సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ) ఇటీవల నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో ఇది పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో వాతావరణ మార్పు, వరద ప్రమాదాలు, కరువులపై అధ్యయనం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాకు కరువు సమస్య పొంచి ఉందని, కర్నూలు, ప్రకాశం జిల్లాలు కూడా తీవ్రమైన కరువును ఎదుర్కొనే అవకాశం ఉందని ఐఐటి నిపుణులు నిర్ధారించారు.
గ్లోబల్ వార్మింగ్ గతంతో పోలిస్తే ఒక డిగ్రీ సెల్సియస్ నుండి 1.5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని తేల్చారు. అధిక ఉష్ణోగ్రత ఒత్తిడి కారణంగా కొండచరియలు విరిగిపడడం వంటి ప్రమాదాలు ఉండవచ్చని వారు పేర్కొన్నారు. వరదల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధ్యయనం తేల్చింది.
వరద ముప్పుతో పాటు, గుంటూరుకు కూడా కరువు ముప్పు పొంచి ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు వరద ముప్పు ఉందని వెల్లడైంది. దేశవ్యాప్తంగా 51 జిల్లాలు అత్యధిక వరద ముప్పును ఎదుర్కొంటాయని.. మరో 118 జిల్లాలు అత్యధిక వరద ముప్పును ఎదుర్కొనబోతున్నాయని తెలిపారు. మరో 91 జిల్లాలను అధిక కరువు ముప్పు వర్గంలో చేర్చారు. 188 జిల్లాలను అధిక కరువు ముప్పు వర్గంలో చేర్చారు.
అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఒడిశా, జమ్మూకశ్మీర్‌లలోని వరద ప్రమాదం ముప్పు 51 జిల్లాలలో అత్యంత తీవ్రంగా ఉందని నివేదిక పేర్కొంది. వీటిని “వెరీ హై” రిస్క్ కేటగిరీలో ఉంచారు. ఇక 118 జిల్లాలు “హై” రిస్క్ కేటగిరీలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. కరువుకు సంబంధించి 91 జిల్లాలు “వెరీ హై” రిస్క్ కేటగిరీలో ఉన్నాయి. 188 జిల్లాలు “హై” రిస్క్‌ను ఎదుర్కొంటున్నాయి. ఈ జిల్లాలు ప్రధానంగా బీహార్, అస్సాం, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలో ఉన్నాయి. ఈ నివేదిక రాష్ట్రాల సామర్థ్యాల పెంపు ప్రాముఖ్యతను చూపిస్తుంది.