వార్నీ...! ఆర్. కృష్ణయ్యకి రాజ్యసభ ఇవ్వడం వెనుక బీజేపీ ప్లాన్ ఇదా...?
ఏపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు ఆర్. కృష్ణయ్య. జాతీయ బీసీ నేతగా ఉన్న ఆయనకు అరుదైన అవకాశం ఇచ్చింది వైసిపి. దానిని నిలబెట్టుకునేందుకు అనేక రకాల ప్రయోగాలు చేశారు. అందులో భాగంగా బీసీ నినాదాన్ని అందుకున్నారు. దానికి కారణం లేకపోలేదు.
తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతు దారుల్లో బీసీలు ఒకరు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. దీనిని గుర్తించిన జగన్ ఎలాగైనా టిడిపిని దెబ్బ కొట్టాలని చూశారు. అందుకే బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. బీసీ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆర్.కృష్ణయ్య ను రాజ్యసభకు పంపించారు. కానీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు అదే ప్రయోగాన్ని వాడుకోవాలని చూస్తోంది బిజెపి.
కృష్ణయ్య తెలంగాణకు చెందిన వ్యక్తి. 2014లో కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం. ఇది కేసీఆర్ కు నష్టం తెస్తుందన్నది చంద్రబాబు ఆలోచన. కానీ ఆ ఎన్నికల్లో కృష్ణయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఓటమి చవిచూసింది. 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు క్రమేపి దూరమయ్యారు కృష్ణయ్య. 2019 ఎన్నికల్లో గెలిచిన జగన్ కు దగ్గరయ్యారు. వైసీపీ తరఫున ఎంపీ అయ్యారు. కానీ ఈ ఎన్నికల్లో ఆయన ప్రభావం చూపలేకపోయారు.
అయితే టీడపీ ప్రయోగించిన వ్యూహం అప్పట్లో ఫెయిల్ అయ్యింది. మొన్నటికి మొన్న ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రయోగించిన అస్త్రం కూడా సక్సెస్ కాలేదు. కానీ అదే కృష్ణయ్యను బిజెపిలోకి తీసుకోవడం వెనుక అసలు మర్మం ఏమిటో తెలియడం లేదు. కృష్ణయ్య ద్వారా ఏపీలో రాజకీయాలు చేస్తామంటే కుదిరే పని కాదు. ఇప్పటికే టీడీపీ ఆధీనంలో కూటమి ఉంది.
అయితే కృష్ణయ్యను తెలంగాణలో అవసరాలకు వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఇప్పటికే అక్కడ ఈటల రాజేందర్ రూపంలో బీసీ నేత ఉన్నారు. అయినా సరే కృష్ణయ్య విషయంలో బిజెపి ఆలోచన ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు. టిడిపి తో పాటు వైసీపీని గెలిపించుకోలేని కృష్ణయ్య.. బిజెపిని ఎంతవరకు గట్టెక్కించగలరు అన్నది ప్రశ్న.