వైసీపీ సానుభూతి పరులను ఏరేస్తున్న చంద్రబాబు..? ఏకంగా వందల మందిని తొలగించారుగా?

గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తోంది కూటమి సర్కార్.  ఏపీ ఫైబర్ నెట్ పేరుతో కేబుల్ ప్రసారాలు, ఇంటర్నెట్ పంపిణీదారుగా ఉన్న ప్రభుత్వ సంస్థ అక్రమాలకు అడ్డాగా మారింది.  వైసిపి హయాంలో ఫైబర్ నెట్ ను తమ జేబు సంస్థగా మార్చుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి.  అప్పట్లో ప్రభుత్వ పెద్దల సిఫారసులతో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు జరిగాయి.  వీరితో ఎలాంటి ప్రయోజనాలు కలగలేదు. ఫైబర్ నెట్ కనెక్షన్లు 10 లక్షల నుంచి ఐదు లక్షలకు తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.



ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా జీవి రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.  వైసిపి హయాంలో అక్రమ నియామకాలు జరిగాయని తెలిపారు. వైసీపీ నేతల సిఫార్సులతో అడ్డగోలు నియామకాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అవసరం లేకున్నా ఎక్కువమంది నియామకాలు చేపట్టారని చెప్పుకొచ్చారు.


పనిచేసేది వైసిపి నేతల ఇంట్లో అయితే.. ఏపీ ఫైబర్ నెట్ నుంచి జీతాలు తీసుకున్నట్లు జీవి రెడ్డి తెలిపారు.  అటువంటి వారిని గుర్తించి తొలగిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు.  తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ సదుపాయంతో పాటు అన్ని రకాల టీవీ ప్రసారాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ఫైబర్ నెట్ ను ప్రారంభించారు.  సామాన్యుడికి అత్యాధునిక నెట్ సదుపాయం అందుబాటులోకి తేవాలన్నదే ఈ ఫైబర్ నెట్ లక్ష్యం.  గత ఐదేళ్లుగా ఫైబర్ నెట్ ను పూర్తిగా దుర్వినియోగం చేశారు.



గత ప్రభుత్వ హయాంలో వైసీపీ సోషల్ మీడియాకు పనిచేసిన వారు సైతం ఏపీ ఫైబర్ నెట్ నుంచి జీతాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు వైసీపీ కీలక నేతల ఇంట్లో పనిచేస్తున్న వారి పేరుతో భారీగా జీతాలు పక్కదారి పట్టించినట్లు విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం, జీవీ రెడ్డి చైర్మన్ గా నియమితులు కావడంతో ప్రక్షాళన ప్రారంభం అయ్యింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 410 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడం విశేషం. ఇప్పుడు ఏపీలో ఇదే సంచలన అంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: