వారిని తప్పించేందుకే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారా?

కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడు నెలలు పూర్తికావస్తోంది.  ప్రభుత్వం లక్ష్యాల మేరకు చకచకా పనులు చేసుకుంటూ పోతోంది.  ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం తన జట్టు పనితీరుపై ఓ కన్నేసి ఉంచారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు తప్పు చేసినా, నిర్లక్ష్యంగా ఉన్నా ముఖం మీదే చెప్పేస్తున్నారు. సరిగా పనిచేయకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటానని ప్రమాణ స్వీకారం రోజే హెచ్చరికలు చేశారు. కానీ, కొందరు మంత్రులు సీఎం స్పీడ్ ను అందుకోలేకపోతున్నారు. దీంతో ఇటీవల మంత్రుల పనితీరుపై మార్కులిచ్చిన సీఎం.. కొందరిని పక్కపెట్టే విషయమై సంకేతాలిచ్చారని చెబుతున్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారని ప్రచారం ఊపందుకుంది. సంక్రాంతి పండగ కానుకగా ఇద్దరికి క్యాబినెట్ బెర్తు ఇస్తామని హామీ ఇచ్చినట్లు టీడీపీ వర్గాల సమాచారం. ప్రస్తుతం 24 మంది మంత్రుల్లో ఒకరిద్దరి పనితీరుపై ముఖ్యమంత్రి పూర్తిగా అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. వీరి స్థానంలో కొత్తవారిని తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.


నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు బాహటంగా ప్రకటించారు.  టీడీపీలో చాలా మంది సీనియర్లు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. విశాఖ జిల్లా నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి జ్యోతుల నెహ్రూ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పితాని సత్యానారాయణ, ఎన్టీఆర్ జిల్లా నుంచి దేవినేని ఉమా, రాయలసీమ నుంచి పరిటాల సునీత తదితరులు మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.


అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మంత్రివర్గంలో తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు చెబుతున్నారు.  నాగబాబుతోపాటు పల్లాను మంత్రి చేయాల్సి వస్తే మంత్రివర్గంలో ఒకరిని రాజీనామా చేయాల్సివుంటుంది. ఆ ఒక్కరు ఎవరు? అనేది టెన్షన్ పుట్టిస్తోంది.


ప్రస్తుత మంత్రుల్లో కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాశ్, ఎస్.సవితమ్మ వంటివారు తొలిసారి గెలిచి మంత్రులయ్యారు. సుభాశ్ పనితీరుపై తొలి నుంచి ముఖ్యమంత్రికి సదాభిప్రాయం లేదంటున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బ్యూరోకాట్ మాదిరిగా పనిచేస్తున్నారే కానీ, రాజకీయంగా దూసుకుపోవడం లేదని చెబుతున్నారు. ఆయన జిల్లాలో ఇప్పటికీ వైసీపీ నేత బొత్స హవా కొనసాగుతోందని, దీన్ని కొండపల్లి అడ్డుకోలేకపోతున్నారని పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.  దీంతో సుభాశ్, కొండపల్లి శ్రీనివాస్ బెర్తులకు ఎసరు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కానీ, మంత్రి కొండపల్లిని తప్పిస్తే విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదం ఉంది.  ఒకరిని తప్పించి పల్లాకు చాన్స్ ఇచ్చి కొద్ది రోజుల తర్వాత పూర్తిస్థాయి ప్రక్షాళన చేపట్టి మొత్తం మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: