శభాష్ ఇస్రో.. అందులో అమెరికా, రష్యా, చైనా తర్వాత ఇండియానే?
పీఎస్ఎల్వీ-సి60 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్లను ఈ రాత్రికి ఇస్రో నింగిలోకి పంపుతోంది. ఈ ప్రాజెక్టు సక్సస్ అయితే డాకింగ్ సత్తా కలిగిన నాలుగో దేశంగా.. అమెరికా, రష్యా, చైనా తర్వాత భారత్ అవతరిస్తుంది. అయితే అసలు డాకింగ్ అంటే ఏంటన్న సందేహం రావడం సహజమే.
స్పేస్లో రెండు వేర్వేరు వ్యోమనౌకలు అనుసంధానం కావడమే డాకింగ్ అంటే. అయితే ఇది సాంకేతికంగా చాలా సవాళ్లతో కూడుకున్న పని.
ఎందుకంటే గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వ్యోమనౌకలు.. స్పేస్లో అనుసంధానం కావడం చాలా కష్టసాధ్యమైన పని. వేగాన్ని నియంత్రించుకుంటూ పరస్పరం చేరువవుతూ, కమ్యూనికేషన్ సాగించుకుంటూ ఈ పని సాగించాలి. ఎక్కడ.. ఏ మాత్రం తేడా వచ్చినా రెండు వ్యోమనౌకలు ఢీకొని పేలిపోతాయి.
అయితే.. అసలు ఈ డాకింగ్ అవసరం ఏంటో తెలుసుకుందాం. స్పేస్లో అంతరిక్ష కేంద్రం వంటి భారీ నిర్మాణాలు నిర్మించాలంటే ఈ టెక్నాలజీ అవసరం. ఈ నిర్మాణాలకు అవసరమైన ఆకృతులను ఒకేసారి రాకెట్లో తరలించలేం. అందుకే విడతలవారీగా విడిభాగాలను కక్ష్యలోకి చేర్చేందుకు డాకింగ్ ప్రక్రియ ఉపయోగపడుతుంది. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు ఈ టెక్నాలజీతోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు ఇండియా కూడా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని భావిస్తోంది. మరి ఆ కల సాకారం కావాలంటే ముందుగా కావాల్సింది ఈ స్పేడెక్స్ టెక్నాలజీయే. అందుకే ఈ రాత్రికి జరిగే ప్రయోగం అత్యంత కీలకం. ఆ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుందాం.