తెలంగాణలో పార్టీ విస్తరణకు లైన్ క్లియర్ చేస్తున్న చంద్రబాబు..! ఈ దెబ్బతో రేవంత్ ఔట్ ఏనా?
తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణా గడ్డ మీద. 2025 మార్చి 29కి ఆ పార్టీకి 43 ఏళ్ళు నిండుతాయి. తెలంగాణా గడ్డ మీద పుట్టిన టీడీపీకి ఇక్కడ అభిమాన గణం ఉంది. పార్టే అంటే మోజు పడే క్యాడర్ కూడా ఉంది. విభజన తరువాత కొన్ని అనివార్యమైన పరిస్థితులలోనే వారు అంతా ఇతర పార్టీల వైపు మళ్లారు. దానికి తోడు సరైన నాయకత్వం అక్కడ లేకపోవడం, తెలుగుదేశం కూడా ఏపీ మీద ఫోకస్ చేసినంతగా తెలంగాణా మీద చేయకపోవడం మరో కారణంగా చెప్పాలి.
ఇపుడు ఏపీలో పార్టీ అత్యంత పటిష్టంగా ఉంది. దాంతో తెలంగాణా మీద తెలుగుదేశం ఫోకస్ పెడుతోంది. జాతీయ స్థాయిలో బీజేపీతో పొత్తు ఉంది. జనసేనతో బంధం ఉంది. ఈ మూడూ కలసి ఏపీలో అద్భుత విజయాన్ని అందుకున్నాయి. అదే ఎన్డీయేను తెలంగాణాలో విస్తరించాలన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు.
ముందు సొంతంగా టీడీపీ బలపడడానికి చూస్తోంది. ముందు తాను బలంగా నిలబడితే ఆ మీదట పొత్తులతో ఏదో విధంగా తెలంగాణాలో రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవచ్చు అని చూస్తోంది. ఈ క్రమంలో టీడీపీ రాజకీయ వ్యూహకర్తలు అయిన ప్రశాంత్ కిశోర్, అదే విధంగా రాబిన్ శర్మలతో గ్రౌండ్ లో టోటల్ గా వర్క్ చేయించి ఒక కచ్చితమైన స్టడీ రిపోర్టుని తీసుకుంది అని అంటున్నారు.
దాని ప్రకారం తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలోని మొత్తం పది ఉమ్మడి జిల్లాలలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి రీ ఎంట్రీ ఇస్తే సైకిల్ జోరు బాగా అందుకుంటుందని నివేదికలో స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. నిజానికి టీడీపీకి దక్షిణ తెలంగాణాలో మంచి బలం ఉంది. ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో టీడీపీకి ఇంకా గట్టి పునాదులు ఉన్నాయని కూడా చెబుతున్నారు. అంటే మొత్తం ఉమ్మడి పది జిల్లాలలో సగానికి సగం జిల్లాలలో టీడీపీకి బలం బాగానే ఉంది అంటున్నారు.
ఇప్పటి నుంచే పటిష్టం చేసుకుంటే 2028 నాటికి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఫోర్స్ గా మారుతుందని అంటున్నారు. దాంతో ఆ దిశగా టీడీపీ అధినాయకత్వం ఫోకస్ పెడుతోంది అని అంటున్నారు. సాధ్యమైనంత తొందర్లోనే టీడీపీకి తెలంగాణా అధ్యక్షుడిని ఎంపిక చేసి ఆ మీదట కార్యక్రమాలను ఊపందుకునేలా చేస్తారు అని అంటున్నారు.