అప్పుడు పుష్కరాలు, ఇప్పుడు తిరుపతి ఘటన..? పాపం చంద్రబాబు కి మాయని మచ్చలు..?

ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మానని గాయాలు ఉంటాయి.  కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలో గోదావరి పుష్కరాలతో పాటు తాజాగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఒక మాయని మచ్చ.  గోదావరి పుష్కరాల ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు.  అనేకమంది గాయపడ్డారు.  తాజాగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. అయితే ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదాలే అయినా.. రెండు ఘటనలు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరగడం విశేషం.


తొలి రోజు పుష్కర స్నానాన్ని ప్రారంభించాలనుకుని భావించారు సీఎం చంద్రబాబు.  ఆయన పుష్కర స్నానం చేసిన కొద్దిసేపటికి తొక్కిసలాట జరిగింది.  చంద్రబాబు ప్రచార యావ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అప్పట్లో దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కు పుష్కర క్రతువును చిత్రీకరించే బాధ్యతను అప్పగించినట్లు ప్రచారం నడిచింది.  దాని కారణంగానే ఒక్కసారిగా తూపులాట జరిగిందన్నది విపక్షాల ఆరోపణ.   అయితే నాటి పుష్కర వీడియోలు బయటకు రాకపోవడం విశేషం.



ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది. ఈనెల 10 నుంచి తిరుమలలో ఉత్తర ద్వార దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.  ఈ దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీకి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది టీటీడీ. అయితే ఒక్కసారిగా ఇక్కడ తొక్కిసలాట జరగడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు.  సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి.  ప్రభుత్వంతో పాటు టీటీడీపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  


టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి ఘటనలు జరగడం మాయని మచ్చగా నిలుస్తోంది. చంద్రబాబుకు పాలనాథుడిగా పేరు ఉంది.  కానీ ఇటువంటి కార్యక్రమాల నిర్వహణలో లోపాలు వెలుగు చూస్తుండడం.. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుండడం మైనస్ గా మారుతోంది.  ఈ ఘటన తర్వాత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా పెరిగింది.  దీనిని టీడీపీ కూటమి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.


మొత్తానికి అయితే ఇటువంటి ఘటనలు ఏ ప్రభుత్వం ఉన్నా మాయని మచ్చగా నిలవడం ఖాయం. గతంలో గోదావరి పుష్కరాలు టీడీపీ ప్రభుత్వానికి మైనస్ చేశాయి.  ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాట ఎటువైపు దారితీస్తుందోనన్న ఆందోళన కూటమి పార్టీల్లో కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: