జన సైనికులకు దువ్వాడ టార్గెట్ అయ్యారా..? ఇక ఆయన పని అంతే నా..?
గత వైసీపీ ప్రభుత్వంల కూటమి నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకున్న నేతలపై వరసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. తప్పు అయిందని చెబుతున్నా విడిచిపెట్టడం లేదు. ఈ పర్వం కొనసాగుతుండగా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై తాజాగా కేసు నమోదు అయ్యింది. ఈయన్ను సైతం అరెస్టు చేస్తారని ప్రచారం నడుస్తోంది.
జనసేన నేత నుంచి దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినట్లు ఓ ఫిర్యాదు అందింది. అయితే ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదుల అందుతున్నాయి. వాటిపై కేసులు నమోదవుతున్నాయి. శాసనసభ సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో.. జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి దువ్వాడ శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు.
సీఎం చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ నెలకు 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు అంటూ దువ్వాడ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో అసలు పవన్ కళ్యాణ్ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఎక్కడో దాక్కున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలపై తొలుత గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఇదే అంశంపై విజయనగరంలోనూ ఫిర్యాదు చేశారు. ఇక అవనిగడ్డతో పాటు మచిలీపట్నం పోలీస్ స్టేషన్లలో సైతం దువ్వాడ శ్రీనివాస్ పై కేసులు నమోదయ్యాయి. కోనసీమ జిల్లాలో జనసేన మహిళా కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే గతంలో కూడా వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్ పై చాలా రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. చంద్రబాబుతో పాటు నాటి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు పై చాలా రకాలుగా మాట్లాడారు. అయితే తాజాగా పవన్ పై చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఫిర్యాదులు వస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. దువ్వాడ అరెస్ట్ తప్పకుండా ఉంటుందని ప్రచారం నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.