ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్ లైసెన్స్ దారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రిటైల్ ఎక్సైజ్ టాక్స్ (ఆర్‌ఈటీ) చెల్లింపు విధానంలో ముఖ్యమైన సవరణలు చేస్తూ రాష్ట్ర ఎక్సైజ్ నియమాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై ఒకేసారి మొత్తం పన్ను చెల్లించాల్సిన బదులు మూడు వాయిదాల్లో చెల్లించే సౌలభ్యం కల్పించింది. ఈ మార్పు లైసెన్స్ దారుల ఆర్థిక భారం తగ్గించే దిశగా ఉందని వ్యాపార వర్గాలు స్వాగతిస్తున్నాయి.కొత్త ఆదేశాల ప్రకారం ఈ ఏడాది నవంబర్ 20లోపు మొదటి విడత, 2026 మార్చి 20లోపు రెండో విడత, 2026 జూలై 20లోపు మూడో విడత చెల్లించాల్సి ఉంటుంది.
లైసెన్స్ వ్యవధి మధ్యలో పర్మిట్ రూమ్ మంజూరు అయితే మిగిలిన కాలానికి అనుపాతికంగా దామాషా ప్రకారం పన్ను వసూలు చేస్తారు. ఈ స్పష్టమైన మార్గదర్శకాలతో లైసెన్స్ దారులు ఆర్థిక ప్రణాళికలు సులువుగా సిద్ధం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సంతకంతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అబ్కారీ శాఖ డైరెక్టర్‌కు ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
గతంలో ఒకేసారి భారీ మొత్తం చెల్లించాల్సి రావడంతో చిన్న వ్యాపారులు ఇబ్బంది పడేవారని, ఈ సవరణతో ఆ సమస్యకు చెక్ పడుతుందని హోటల్, బార్ అసోసియేషన్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ నిర్ణయం రాష్ట్రంలో మద్యం వ్యాపార రంగంలో సానుకూల వాతావరణం సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక ఒత్తిడి తగ్గడంతో కొత్త లైసెన్సులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆదాయం కూడా స్థిరంగా వస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ మూడు వాయిదాల విధానం రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయ వసూళ్లకు కొత్త మార్గం చూపనుంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు