కేసీఆర్‌కు కాళేశ్వరం అంటే ప్రేమ ఎందుకు.. పాలమూరు అంటే కోపమెందుకు?

తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్లి లక్ష కోట్ల రూపాయలు వెచ్చించిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. గత పదేళ్లలో మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులు పెండింగ్‌లోనే మిగిలిపోయాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు ప్రాజెక్టుకు రెండేళ్లలోనే ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పురోగతి సాధించామని వివరించారు.

గతంలో ఒక మోటార్ మాత్రమే తెరిచిన చోట తమ పాలనలో పదకొండు మోటార్లు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసం నిర్మించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  పాలమూరు ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు గతంలో సాధించలేదని కూడా ఆయన హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు ప్రాజెక్టులో భారీ పురోగతి సాధించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రెండేళ్లలో అరవై ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ పూర్తి చేశామని చెప్పారు. అదే విధంగా ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగాయని తెలిపారు.

గతంలో డీపీఆర్ వెనక్కి వచ్చినప్పుడు సరైన సమాధానాలు ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్ని సమాధానాలు సమర్పించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లామని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు ఎక్కువ నీటి అవసరాలు ఉన్నప్పటికీ జూరాల నుంచి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా పాలమూరును చేపట్టడం వల్ల తెలంగాణకు లాభం జరిగేదని ఆయన అభిప్రాయపడ్డారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు గతంలో వెయ్యి ఆరు వందల కోట్ల రూపాయలు కూడా కేటాయించలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.


 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: