`ఆశా` కిరణ్.. ఆశలు ఫలించేనా.. ?
వాస్తవానికి ఆశా కిరణ్.. కొన్ని రోజుల కిందట మీడియా ముందుకు వచ్చినప్పుడు మంచి హైప్ కనిపించిం ది. అంతేకాదు.. ఆమెపై భారీగానే ఆశలు అల్లుకున్నాయి. ఆమె కూడా.. ముందు ప్రజలకు సేవ చేస్తానని తర్వాత.. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. దీనికి డిసెంబరు 26ను ముహూర్తంగా నిర్ణయించారు. కానీ.. ఆ రోజు అయితే వచ్చింది. కానీ, ఆశా కిరణ్ మాత్రం దుమ్ము రేపలేకపోయారు. విజయవాడ నుంచి ర్యాలీగా పర్యటిస్తానని చెప్పినా.. ఆమె విజయవాడలో ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొనలేదు.
నేరుగా వెళ్లి విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వాస్తవానికి రంగా అభిమానులు విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరిజిల్లాల్లో ఉంటే.. విశాఖకు ఆశా కిరణ్ వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు.. దీనికి సంబంధించిన కవేరేజీ కూడా పెద్దగా రాలేదు. అంతేకాదు.. ఆశా కిరణ్ కూడా తన ప్రసంగాల్లో పెద్దగా పస చూపించలేక పోయారు. తాను ఏం చేయాలని అనుకున్న విషయాన్ని చెప్పడం కంటే.. గత ప్రస్తుత ప్రభుత్వాలను ప్రశ్నించడం గమనార్హం.
తద్వారా.. వ్యూహ లేమితో ఆశా కిరణ్ అడుగులు తొలిరోజే తడబడ్డాయన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి విజయవాడ కేంద్రంగా ఆమె మాట్లాడి ఉంటే.. రంగా విగ్రహానికి పూల మాల వేసి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ.. అలా చేయలేదు. పైగా.. ప్రభుత్వాలను ప్రశ్నించడం ద్వారా.. తమ వ్యూహాన్ని సమర్థంగా వివరించలేకపోయారు. మెజారిటీ వర్గాన్ని ఆమె ఆకర్షించలేక పోయారు. మొత్తంగా.. ఆశా కిరణ్ పెట్టుకున్న ఆశలు తొలిరోజే చప్పగా సాగాయన్న వాదన అయితే వినిపిస్తోంది. మరి మున్ముందయినా ఆమె ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.