ఆఫ్ది రికార్డ్: జగన్ ధైర్యం అదేనా.. !
అధికారంలో ఉన్నప్పుడు.. దీనికి ముందుకూడా.. జగన్ బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించారు. బీజేపీ కి భారీ మెజారిటీ వచ్చిన 2014, 2019 ఎన్నికల్లోనూ కూడా జగన్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సాను కూలంగానే నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం ఎలాంటి చట్టాలు తీసుకువచ్చినా.. తాము అనుకూలమనే ప్రకటనలు జారీ చేశారు. ఒకానొక దశలో మూడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా ఉద్యమం చెలరేగినప్పుడు కూడా.. జగన్ అనుకూలంగానే మద్దతు పలికారు.
ఇక, అధికారంలో ఉన్నప్పుడు కూడా అలానే వ్యవహరించారు. మొత్తంగా పార్టీకి అనుకూలంగా ఢిల్లీలో వేదికను నిర్ణయించుకున్నారు. దాని ప్రకారమే ముందుకు సాగారు. ఇక, ఇప్పుడు ఏపీలో బీజేపీ కూటమి కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత.. కూడా.. ఆ పార్టీకి అనుకూలంగానే ఉన్నారన్నది జాతీయ మీడియా వర్గాలు చెబుతున్న మాట. ఇదే కూటమి పార్టీల్లో తరచుగా చర్చకు వస్తోంది. మరోవైపు.. బీజేపీ కూడా డ్యూయల్ రోల్ పోషిస్తోందనేది రాజకీయ పండితులు వేస్తున్న అంచనా.
కేంద్రంలో మళ్లీ మళ్లీ అధికారంలోనే కొనసాగాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి.. ఏ పార్టీ కూడా.. వ్యతిరేకం కాదు. అందుకే.. ఏపీలో టీడీపీతో కలిసి ఉన్నా.. వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో.. ప్రజల మూడ్ ఎలా ఉంటుందో తెలియక.. వైసీపీని దూరం చేసుకునే పరిస్థితి బీజేపీకి లేదు. మళ్లీ అవసరమైతే.. బయట నుంచి మద్దతు ఇచ్చేవారిని ఆ పార్టీ ఎప్పుడూ కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. ఇదే.. ఇప్పుడు జగన్కు కలిసి వస్తోందని ఆఫ్ దిరికార్డుగా రాజకీయ నాయకులు చెబుతున్న మాట.