ఎంసెట్ షెడ్యూల్ మార్పు...!!
తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ప్రకటన జారీ, దరఖాస్తుల ప్రక్రియ షెడ్యూల్ పూర్తిగా మారనుంది. వాటి జారీ మరో వారం పది రోజులు ఆలస్యం కానుంది. ఫిబ్రవరి 27న ప్రకటన జారీ చేస్తామని, మార్చి 3వ తేదీ నుంచి దరఖాస్తులను అందుబాటులోకి తెస్తామని... పూర్తి చేసిన వాటిని అదే రోజు స్వీకరిస్తామని ఎంసెట్ అధికారులు పేర్కొన్నా అది సాధ్యపడటం లేదు. ఆన్లైన్ సేవలను అందించే సంస్థను ఖరారు చేయడంలో ఆలస్యం అవుతుండటంతో ఎంసెట్ షెడ్యూల్ మారనుంది. ఆయా ప్రవేశ పరీక్షలు నిర్వహించాలంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం, హాల్టికెట్లు జారీ చేయడం తదితర విధులు నిర్వహించాలి. అందుకు ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు అప్పగించాలి.
ఏటా మాదిరిగా ఈసారి కొన్ని సంస్థలకు సమాచారం ఇచ్చి తక్కువ ధర కోట్ చేసిన సంస్థను ఖరారు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తున్న సమయంలో బహిరంగ టెండర్లు పిలవకుండా చేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి.. మీరే నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్యకు దస్త్రాన్ని పంపింది. దాంతో అది అక్కడే ఆగిపోయింది. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని కొద్ది రోజుల క్రితం అధికారులు భావించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 27న జారీ కావాల్సిన ఎంసెట్ ప్రకటన రెండు మూడు రోజులు ఆలస్యం కావొచ్చనుకున్నారు. దరఖాస్తుల ప్రక్రియ మాత్రం యథావిధిగా ఉంటుందని భావించారు. అయితే అది మరో వారం పది రోజులు పట్టవచ్చని తాజాగా అంచనా వేస్తున్నారు.