బీటెక్ బాబులకు గుడ్ న్యూస్.. 23000 ఉద్యోగాలు.. !
ఆర్థిక మాంద్యం ప్రభావంతో కొన్ని సంస్థలు ఉద్యోగాలకు కోత వేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సంస్థ ఏకంగా 23000 కొత్త ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని ప్రకటించడం నిరుద్యోగుల్లో ఆశలు రేపుతోంది. వచ్చే ఏడాది భారత్ లో వృత్తి విద్యా కళాశాలల నుంచి 23,000కు పైగా స్టెమ్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లను నియమించుకునే యోచనలోఉన్నట్లు ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ప్రకటించింది.
వేగంగా వృద్ధి చెందుతున్న తమ డిజిటల్ విభాగం అవసరాల కోసం ఈ నియామకాలు చేపడుతోందట. వచ్చే ఏడాది 23,000కు పైగా విద్యార్థులను తీసుకుంటున్నారట. గతేడాది సంస్థ చేపట్టిన నియామకాలతో పోలిస్తే ఇవి 30 శాతం అధికమని కాగ్నిజెంట్ ఇండియాచైర్మన్, ఎండీ రామ కుమార్ రామమూర్తి ఓప్రకటనలో తెలిపారు.
చెన్నైలో 'సీఐఐ కనెక్ట్ 2019' కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 80కి పైగా ఇంజినీరింగ్ కళాశాలల్లో 15,000 మందికి ఇప్పటికే ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చారట. అయితే ఇదే సంస్థ.. భారత్ లో 7,000కు పైగా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.