'గర్భ్ సంస్కార్' పేరిట లక్నో వర్సిటీలో వినూత్న కోర్సు..!
అధిక వేతనాలతోపాటు ప్రపంచాన్ని చుట్టి వచ్చే అవకాశాలను అందుకోవాలంటే చదువు చాలా ముఖ్యం. అలాగే యూనివర్సిటీల్లో ఆసక్తికరమైన సబ్జెక్టుల్లో భిన్నరకాల వైవిధ్యభరితమైన ఇంటిగ్రేటెడ్ కోర్సులు విద్యార్థులను స్వాగతిస్తున్నాయ్. అయితే 'గర్భ్ సంస్కార్' పేరిట లక్నో వర్సిటీ సర్టిఫికెట్, డిప్లొమా కోర్సును ప్రారంభిస్తోంది. గర్భ్ సంస్కార్ కోర్స్ ఏంటి అనుకుంటున్నారా..? అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వచ్చేద్దాం.
గర్భం దాల్చినప్పుడు ఎలాంటి డ్రెస్‌లు వేసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గర్భ్ సంస్కార్ పేరిట లక్నో యూనివర్సిటీ దేశంలోనే తొలిసారిగా సర్టిఫికెట్, డిప్లమో కోర్సును ప్రారంభించనుంది. ఈ కోర్సులో భాగంగా విధ్యార్థులకు గర్భినులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. దీనిలో గర్భినులు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి దుస్తులను ధరించాలి మరి యు వ్యాయామం ఎలా చేయాలి అనే అంశాలతో పాటు సహజ ప్రసవం జరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరిస్తారు.
ఈ కోర్సు ద్వారా యువతకు ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. అలాగే, పెళ్లయ్యాక విద్యార్థినులు తల్లులుగా మారే క్రమంలోనూ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక గత ఏడాది వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ఆనందిబెన్ మాట్లాడుతూ మహా భారతంలో అభిమన్యుడు తల్లి గర్భంలోనే యుద్ధ నైపుణ్యాలను అందిపుచ్చుకున్న తీరును వివరించారు. జర్మనీలోని ఓ వర్సిటీలో ఈ తరహా కోర్సు ఉన్నట్టు కూడా ఆమె వెల్లడించారు. మరో విషయం ఏంటంటే.. గర్భ్ సంస్కార్ కోర్సు అభ్యసించేందుకు పురుష విద్యార్థులకూ అవకాశం కల్పిస్తామని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.