ఐటీ కంపెనీల ఉద్యోగాల జాతర..!
జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక శుభవార్త. భారత్ లో అతిపెద్ద ఐటీ కంపెనీలుగా పేర్కొన్న టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (INFOSYS), హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ (HCL TECHNOLOGIES), విప్రో (WIPRO) సంస్థలు భారీగా ఫ్రెషర్స్ ను ఉద్యోగాలలో తీసుకునేందుకు ప్రణాళిక చేపట్టనున్నాయి. కరోనా తర్వాత ఐటీ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి నాలుగు కంపెనీలు కలిపి సుమారుగా 91,000 మంది క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించుకునే అవకాశం ఉంది.
TCS ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లక్కాడ్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సంవత్సరంలో సుమారు 40,000 మందిని కొత్తగా ఉద్యోగాలలోకి తీసుకున్నామని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ లో 24 వేల మంది ఫ్రెషర్లను రెగ్యులర్ చేయాలని ఇన్ఫోసిస్ నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఈ కంపెనీ 15 వేల మందిని మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరానికి కొత్తగా నియమించుకుంది.
ఈ ఉద్యోగాలు పెరగడానికి గల కారణాల ను HCL టెక్నాలజీ హెచ్ఆర్ వి.వి.అప్పారావు గారు వివరించారు. వీసా సమస్యలు, జీతాల హెచ్చుతగ్గులు, వివిధ దేశస్తులు స్థానికులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించడం కోసం వంటి కారణాలవల్ల ఉద్యోగాలకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం లో కొత్తగా నియమించిన HCL ఉద్యోగస్తులలో 70 శాతం మంది భారతీయులు ఉన్నారని చెప్పుకొచ్చారు. మిగిలిన 30 శాతం మంది ఇతరులు ఉన్నారని తెలిపారు.జర్మనీకి చెందిన రిటైలర్ సంస్థ మెట్రో (METRO) తో విప్రో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో కొత్త ఉద్యోగాల డిమాండ్ ఏర్పడింది.
గత రెండు త్రైమాసికాల్లో ఐటీ కంపెనీలు రిక్రూమెంట్ ప్రక్రియను వేగవంతం చేశాయి. ఐటీ విభాగంలో నైపుణ్యాలు ఉన్నవారికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని విప్రో చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సౌరబ్ గోవిల్ పేర్కొన్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నందువల్ల అవకాశాలు కూడా ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. కరోనా తర్వాత పెద్ద కంపెనీలు కొత్త లక్ష్యాలను ఏర్పరుచుకోవడం వల్ల కొత్త ఉద్యోగాలకు అవకాశం ఏర్పడింది. దీంతో క్యాంపస్ రిక్రూట్మెంట్ల పై పెద్ద కంపెనీ లు దృష్టి పెడుతున్నాయని నిపుణులు విశ్లే షిస్తున్నారు. ఏదిఏమైనా నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు.