అవును అది భూతల స్వర్గం.. ఇలాపైకి వచ్చి అక్కడ అప్సరసలు స్నానం చేస్తారంట...
ఈ గ్రామంలోని అందాలు, జలపాతం హొయలు టూరిస్టులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.సుమారు 50 అడుగుల ఎత్తు నుండి పడే అప్సరకొండ జలపాతాలు క్రింద సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులోకి వెళతాయి. టూరిస్టులు మెరిసే జలపాతం దృశ్యాలతో పాటు కొండ పై నుండి అద్భుతమైన సూర్యాస్తమయం దృశ్యాలను కూడా ఆస్వాదించవచ్చు. సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలకు అప్సర కొండ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మహా గణపతి, ఉగ్ర నరసింహ ఆలయాలు కూడా ఉన్నాయి. అప్సర కొండ జలపాతం అనేక చెట్ల మూలాల గుండా ప్రవహించడం వల్ల ఈ నీటికి గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
అప్సరకొండకు ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవడం ఒక గొప్ప అనుభవం అని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో పర్యాటకులు సందర్శించేందుకు అనేక సహజ గుహలు కూడా ఉన్నాయి. పాండవులు వనవాసం సమయంలో ఈ గుహల్లో కొంత కాలం నివసించినట్లు పురాణ కధనం ఉంది. అందుకే వీటికి చూసేందుకు టూరిస్టులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. వర్షాకాలం ఈ జలపాతాల సందర్శనకు సరైన సమయం. కాబట్టి ఇక్కడికి వెళ్లాలనుకునే పర్యాటకులు జూన్ నుండి అక్టోబర్ మధ్య ట్రిప్ ను ప్లాన్ చేసుకుంటే మంచిది. అప్సరకొండ జలపాతాలను చేరుకోవడానికి అన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హొన్నవర్ నుండి ఈ జలపాతాలకు 6 కిలోమీటర్ల దూరం.