తెలంగాణ ఉద్యోగాలకు ఆంధ్రావాళ్లు పోటీపడొచ్చా?
ఏపీ సర్కారు ఇటీవల పెద్దగా ఉద్యోగ ప్రకటనలు ఇవ్వలేదు. దీంతో.. వారు తెలంగాణ ఉద్యోగ ప్రకటన చూసి.. అయ్యో.. మన ఏపీలోనూ ఇలాంటి నోటిఫికేషన్ వస్తే బావుండేదే అని చర్చించుకుంటున్నారు. మరికొందరు తెలంగాణ ఉద్యోగాలకు మనం పోటీ పడకూడదని అని ఆరా తీసే పనిలో ఉన్నారు. మరి తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణవాళ్లకు మాత్రమేనా.. ఏపీ విద్యార్థులు పోటీ పడకూడదా.. ఒక వేళ పోటీ పడితే వారి పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
తెలంగాణ ఉద్యోగాలకు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడొచ్చు. అయితే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా చాలా చాలా తక్కువ. ఎలాగంటే.. గతంలో నాన్ లోకల్ అంటూ ఓ రిజర్వేషన్ ఉండేది. ఇప్పుడు దాన్ని తీసేశారు.. ఇప్పుడు తెలంగాణలో నూటికి 95 శాతం ఉద్యోగాలు స్థానికులతోనే భర్తీ చేయాలి. అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యోగాలకు ఏపీ అభ్యర్థులు పోటీపడితే.. ఆ 5 శాతం ఉద్యోగాలకే వారు అర్హులు అవుతారు. అంటే 100 ఉద్యోగాలు ఉంటే.. కేవలం 5 ఉద్యోగాలకు మాత్రమే ఆంధ్రావారు పోటీపడే అవకాశం ఉంది.
అందులోనూ ఈ 5 శాతం కూడా పూర్తిగా నాన్ లోకల్ వారి కోసం కాదు.. ఈ 5 శాతం ఓపెన్ కేటగిరీ అన్నమాట. అంటే మళ్లీ ఇక్కడ ఏపీ వారు.. తెలంగాణ వారితో కలసి పోటీపడవలసి ఉంటుంది. అంటే ఈ 5 శాతం ఎవరికైనా దక్కొచ్చన్నమాట. అంటే మీకు ఏ పరీక్షలోనైనా టాపర్గా ఉంటామన్న భరోసా ఉన్నవారే తెలంగాణ ఉద్యోగాలకు ఏపీ వారు పోటీ పడితే దక్కించుకునే అవకాశం ఉంటుంది. వంద ఉద్యోగాలు ఉంటే.. ఏపీవారికి ఉద్యోగం రావాలంటే టాప్ 3 ర్యాంకుల్లో ఉంటేనే అవకాశం ఉంటుందన్నమాట.