విద్యుత్ కోతలతో 10 వ తరగతి విద్యార్థుల కష్టాలు...
అయితే ఇలా విద్యార్దులు వారి భవిష్యత్తు కోసం నానా తంటాలు పడి రాత్రనక పగలనకా చదువుతుంటే.. మరో వైపు తగుదునమ్మా అంటూ విద్యుత్ కోతలు విద్యార్దులకు ఆటంకాలు కలిగిస్తున్నాయి. నిత్యం గంటల తరబడి కరెంటు కోతలతో ప్రజలకు ఎలాగో బాధలు తప్పడం లేదు. అయితే ఇప్పుడు అది విద్యార్థుల చదువుకు ఆటంకంగా మారుతుంది. అసలే సూర్యుడు భగ్గుమంటూ చమటలు పట్టిస్తుంటే మరో వైపు ఈ విద్యుత్ కోతలతో మా పిల్లలు సరిగా చదవలేకపోతున్నారు, ఉక్కపోతతో పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్ కాలేక పోతున్నారు అంటూ పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాసేపు అయితే పర్వాలేదు. కానీ రోజు గంటల కొద్దీ కరెంట్ తీస్తుంటే మా నిత్య జీవితానికే కాదు. మా పిల్లల చదువుకు కూడా ఇది సమస్యాత్మకంగా ఉంది అంటూ వాపోతున్నారు. కాగా ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు 27వ తేదీ నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. అలాగే మరో వారం రోజుల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విద్యార్దులు హడావిడిగా అదే పనిగా పరీక్షల కోసం రెడీ అవుతున్న క్రమంలో కరెంట్ కోతలు ఇబ్బంది పెడుతున్నాయి అంటున్నారు.