తెలంగాణలో డీఎస్సీ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.ఇటీవల సబ్జెక్టులు, పోస్టుల వారీగా పరీక్షల తేదీలతో కూడిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను వెల్లడించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. ఇవే తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొంది. అయితే ఇటీవలే టెట్ ఫలితాలు విడుదలయ్యాయని.. టెట్‌కు, డీఎస్సీకి భిన్నమైన సిలబస్ ఉండటంతో చదవడానికి సమయం సరిపోవడం లేదని పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని గత కొన్నాళ్లుగా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో వారంతా సోమవారం ఉదయం లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడించి, నినాదాలు చేశారు. టెట్ పరీక్ష నిర్వహించి ఆ వెంటనే డీఎస్సీ నిర్వహిస్తున్నారని..రెండు పరీక్షల సిలబస్ వేర్వేరు ఉండటంతో డీఎస్సీ ప్రిపరేషన్ కు సమయం కావాలంటూ అభ్యర్థులు కోరుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో అభ్యర్థులు సోమవారం విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు.
అయితే అభ్యర్థుల ఆందోళలనలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. డీఎస్సీ పరీక్షల వాయిదాను అంగీకరించలేదు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించేందుకు మొగ్గు చూపింది. ఈనెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన నిరాశగానే ముగిసింది.కాగా ఈనెల 11వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి పాఠశాల విద్య అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది. డీఎస్సీని కంప్యూటర్ టెస్ట్ గా నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29న సుమారు 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ..ఈనెల 18 నుంచి కంప్యూటర్ ద్వారా పరీక్షను నిర్వహించనుంది.