పంద్రాగస్ట్: రేవంత్ రాక కోసం ముస్తాబవుతున్న గోల్కొండ కోట..!
సీఎం హోదాలో ఆయన తొలిసారి గోల్కొండపై త్రివర్ణ పతాకం ఎగురవేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.ముఖ్యమంత్రి సహా, ప్రముఖులు గోల్కొండ కోటకు తరలిరానుండటంతో ఏర్పాట్లను సీఎస్ శాంతకుమారి సోమవారం పరిశీలించారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చి గోల్కొండలో ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు. వర్షం కురిస్తే.. వేడుకలకు హాజరయ్యేవారు తడవకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. వీఐపీలు రానున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు, పార్కింగ్ పై దృష్టి సారించాలని పోలీసులను ఆమె ఆదేశించారు.ఓ వైపు సీఎస్ ఆదేశాలతో అధికారులు పరుగులు పెడుతుంటే.. అదే స్థాయిలో గోల్కొండ కోట ముస్తాబవుతోంది. ఏటా రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. జెండా వందనం చేసేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు రానున్న నేపథ్యంలో అనేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖుల ముందు నిర్వహించే పరేడ్‌కి సంబంధించి రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, ఈ పరేడ్ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.తెలంగాణ ఆవిర్భావం నుంచి 2023 స్వాతంత్ర్య వేడుకల వరకు మాజీ సీఎం కేసీఆరే గోల్కొండపై జెండా ఎగురవేసేవారు. కాగా.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తొలిసారి జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.