ఎవరెన్ని మాటలన్నా మా ఆయన బంగారం: వీరప్పన్ భార్య...!!

Shyam Rao
దేశ వ్యాప్తంగా పోలీసులను , ప్రజలను , నిఘా వర్గాలను, రాష్ట్ర ప్రభుత్వాలను సైతం హడలెత్తించిన భారత దేశంలోనే అతిపెద్ద స్మగ్లర్ ఎవరంటే టక్కున వచ్చే సమాధానమే వీరప్పన్. ఘరానా హంతకుడు, బందిపోటు, చందనపుచెక్కల స్మగ్లర్‌, అడవిదొంగ అని పలు రకాల పేర్లతో పిలవబడుతున్నా తన భార్య ముత్తులక్ష్మి మాత్రం ఆయన్ని ఎవరేమన్నా మా ఆయన మాత్రం బంగారం. నన్ను మాత్రం తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాడని ముత్తులక్ష్మి మురిసిపోతోంది. 



ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అతడి గురించి చాలా విశేషాలు చెప్పారు. వీరప్పన్ తానే స్వయంగా ఓ పుస్తకాన్ని ప్రచురించబోతున్నానని, అందులో అతడి మరో కోణాన్ని ముందుంచుతానని ఆమె పేర్కొన్నారు. వీరప్పన్‌ను పెళ్లిచేసుకున్నప్పుడు తన వయసు 15 ఏళ్లేనని, అతడితో కలిసి తిండీతిప్పలూ లేకుండా అడవిబాట పట్టిన రోజులు, నెలలూ ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. వీరప్పన్ హీరో కాకపోవచ్చుగానీ.. తనకు మాత్రం వీరపురుషుడేనని, తన పట్ల ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తించనేలేదని ముత్తులక్ష్మి పేర్కొన్నారు. అతడి భార్య కావటం తాను చేసుకున్న అదృష్టంగానే ఇప్పటికీ భావిస్తున్నానన్నారు.



వనవాసాన్ని విడిచిపెట్టమని తాను, తన తండ్రి ఎంతగా మొత్తుకున్నా వీరప్పన పట్టించుకోలేదన్నారు. అతడిని ఉత్తరాదికి తరలించాలని అనుకున్నంతలోగానే పరిస్థితులు దారుణంగా మారాయని చెప్పారు. వీరప్పన్కు పన్నెండేళ్ల వయసునప్పుడు.. అతడు చేయని నేరానికి కుక్కలా సంకెళ్లతో బంధించి తీసుకెళ్లిన సంఘటన కూడా ఉందన్నారు. అడవి ఏనుగుల దంతాలను ఎవరో దొంగిలిస్తే.. అటవీశాఖ అధికారులు అనుమానంతో తన భర్తను చిత్రహింసలు పెట్టారని, ఆ కారణాలవల్లే వీరప్పన్‌ చందనపు చెక్కల స్మగ్లర్‌గా మారి ఉంటాడని ముత్తులక్ష్మి వివరించారు. 



తన రెండో కుమార్తె అడవిలోనే పుట్టిందని.. అడవిలో అతడితో గడిపిన అనుభవాలు వింత అనుభూతిని కలిగించేవని, ఆ వివరాలన్నిటినీ తన పుస్తకంలో పొందుపరుస్తానని ముత్తులక్ష్మి చెప్పారు. వీరప్పన్ ఏనుగులను చంపాడని, చందనపు చెట్లను నరికాడని అందరూ అదేపనిగా చెబుతున్నా వాస్తవానికి ఆ పనులతో అతడు ఏమాత్రం లాభపడనేలేదని, లబ్ధి పొందిందంతా పెద్దమనుషులేనని అన్నారు. ఆ పెద్దలే తన భర్తను బలిపశువును చేశారని చెప్పారు. వీరప్పన చిత్రం కాపీరైట్‌ పరిహారంగా రూ.25లక్షలు తీసుకుని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో ఎందుకు గొడవపడుతున్నారని ప్రశ్నించగా.. ఒప్పంద పత్రాల్లో ఏముందో కూడా తెలియకుండానే తాను సంతకాలు చేశానని, ఆ చిత్రం తమిళవెర్షన్ను తానే విడుదల చేయాలనుకున్నానని, చివరకి రామ్‌గోపాల్‌ వర్మ మాటతప్పాడని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: