ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదా?

R.PARMESWAR

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి లాక్‌ డౌన్‌ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. మూడో దశ ఉంటుందనే హెచ్చరికల మధ్య ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ కీలక ప్రకటన చేశారు.  నగరంలో పాజిటివిటి రేటు 5శాతం దాటితే తలెత్తే మూడో దశ కొవిడ్‌ మహమ్మారిని కట్టిడి చేసేందుకు ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధిస్తామని వెల్లడించారు. మరో వైపు పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఢిల్లీ మహానగరంలో కొవిడ్‌ రోగుల కోసం  కొత్తగా 37వేల పడకలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని జైన్‌ తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిట్ రేటు 0.08 శాతంగా ఉంది. తాజాగా 61 కొవిడ్‌-19 కేసులు రాగా రెండు మరణాలు సంభవించాయని ఢిల్లీ ఆరోగ్య విభాగం జారీ చేసిన బులెటిన్‌ వెల్లడించింది.


నిబంధనలు అనుసరిస్తూ అప్రమత్తంగా ఉండటం ద్వారా కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టవచ్చని సత్యేందర్‌ జైన్‌ ప్రజలకు మరోసారి నొక్కిచెప్పారు.  “మూడో దశ వస్తే మా స్పందను ఎలా ఉంటుందో మేము గతంలోనే చెప్పాం. పాజిటివిట్‌ రేటు 5 శాతం దాటితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే లాక్‌డౌన్‌ విధిస్తాం” అని ఆరోగ్య మంత్రి వెల్లడించారు.


రెండో దశ వ్యాప్తి సమయంలో ఆక్సిజన్ కొరత, రవాణా సమస్యలను మేము గుర్తించలేకపోయాం. ఆ తర్వాత పరిస్థితిని చక్కదిద్దాం, ఇప్పుడు 50కి పైగా ఆక్సిజన్‌ ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు ఆక్సిజన్‌ కొరత  తలెత్తకుండా చూసేందుకు మరికొన్నింటిని కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. పిల్లలపై మూడో దశ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే హెచ్చరికల మధ్య పిల్లల వార్డులు, పిల్లల ఆస్పత్రుల్లో సదుపాయాలను ఢిల్లీ ప్రభుత్వం పెంచుతోంది.  మూడో దశ అన్నది వాస్తవమని, దాన్ని ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా తెలిపారు.


మరో వైపు దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 44,643 కేసులు నమోదైయ్యాయి. ముందు రోజుతో పోల్చితే ఇది 4 శాతం ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: