ఆవాల వలన కలిగే ప్రయోజనాలు తెలుసా...?
నిత్యం వంటింట్లో వాడే పోపు దినుసుల్లో ఆవాలను ఎక్కువగా ఉపయోగిస్తామన్న విషయం తెలిసిందే. ఆవాలను ఎక్కువగా ఉపయోగించటం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుర్వేద చికిత్సలో ఎంతో ఉపయోగపడే ఆవాలలో ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, మ్యాంగనీస్, క్యాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఆవాలలో సోడియం, పొటాషియం, విటమిన్లు, డైటరీ ఫాట్స్, కార్బో హైడ్రేట్స్, బీటా కెరోటీన్ కూడా ఉంటాయి.
ఆవాలలో పోషక విలువలు మాత్రమే కాదు ఎన్నో ఔషధ విలువలు కూడా దాగి ఉన్నాయి. ఆవాలకు శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టి కొవ్వు తగ్గించే గుణం ఉంది. ఆవాలతో తయారు చేసిన ఆవ పొడిని పులిపిర్లపై రాస్తే పులిపిర్లు ఎండిపోయి రాలిపోతాయి. పంటినొప్పి సమస్యతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో ఆవాలు వేసి ఆ నీటిని పుక్కలిస్తే పంటినొప్పి తగ్గుతుంది. వాంతులు, నీళ్ల విరేచనాలు అయ్యే సమయంలో కడుపు భాగంలో ఆవ పొడి రాసుకుంటే తక్షణమే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
పచ్చి ఆవాల పొడిని చేదు ఆవాల తైలంతో కలిపి బట్టతల ఏర్పడే లక్షణాలు కనిపించిన చోట మరియు, జుట్టు రాలిపోయే చోట రాస్తే కొత్త వెంట్రుకలు పుట్టుకొస్తాయి. ఆవాలు క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు రక్త ప్రసరణను వేగవంతం చేస్తాయి. ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి తలనొప్పి వస్తున్న వైపు రాస్తే తలనొప్పి కూడా తగ్గుతుంది. కర్పూరంలో ఆవాల ముద్దను కలిపి రాసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను ఆవాల ద్వారా అదుపులో ఉంచవచ్చు. ఆవాలు తినే వారిలో జీర్ణశక్తి వృద్ధి చెందటంతో పాటు రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. వేడి నీళ్లలో కొంచెం ఆవపొడి, తేనె కలుపుకొని తాగితే దగ్గు, గొంతునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.