ఏ రంగు గుడ్లు మంచివి తెల్లవా...? గోధుమ రంగువా...?

Reddy P Rajasekhar

గుడ్డు తింటే మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. బేకింగ్ ఆహారంలో, సలాడ్లలో కూడా గుడ్లను విరివిగా ఉపయోగిస్తారు. ప్రోటీన్లు, కొవ్వులు అధికంగా ఉండే గుడ్లను ధనవంతుల నుంచి సామాన్యుల వరకు అందరూ కొనగలరు. రోజూ రెండు గుడ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అయితే చాలామందిని తెల్ల గుడ్లు మంచివా....? గోధుమ రంగు గుడ్లు మంచివా....? అనే ప్రశ్న వేధిస్తూ ఉంటుంది. 
 
తెల్ల గుడ్లతో పోలిస్తే గోధుమ రంగు గుడ్ల ఖరీదు ఎక్కువ. కానీ తెల్ల గుడ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయో గోధుమ రంగు గుడ్లలో కూడా అన్నే పోషకాలు ఉంటాయి. రంగులో మినహా రుచిలో కానీ ఇతర విషయాల్లో కానీ తెల్ల రంగు గుడ్లు, గోధుమ రంగు గుడ్ల మధ్య పెద్ద తేడా ఉండదు. రెండు గుడ్లలో ప్రోటీన్లు, కేలరీలు, కొవ్వులు సమానంగా ఉంటాయి. గుడ్లలో ఉండే కాల్షియం ఎముకలకు కావాల్సిన బలాన్ని ఇస్తుంది. 
 
సాధారణంగా గుడ్ల రంగు తెలుపే. అయితే కోళ్లకు పెట్టే తిండి వల్ల గుడ్ల రంగు మారుతూ ఉంటుంది. మొక్క‌జొన్న సంబంధిత ఆహారం పెడితే కోళ్లు పెట్టే గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. గోధుమ వర్ణం గుడ్లలో పచ్చసొన చిక్కగా ఉంటుంది. అయితే శాస్త్రవేత్తలు తెల్ల గుడ్లతో పోలిస్తే గోధుమ వర్ణం గుడ్లలో ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. . గుడ్ల సైజు విషయంలో తెల్లవి కాస్త పెద్దగా, గోధుమ రంగువి చిన్నగా ఉంటాయి. 
 
మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రోటీన్లు గుడ్డులోనే ఉన్నాయి. అందువల్లే గుడ్డును సంపూర్ణ ఆహారం అని అంటారు. ఒక గుడ్డు సుమారుగా 50 గ్రాములనుకుంటే, దానిలో 90% నీరు, 10% పొషకపదార్ధాలు ఉంటాయి. గుడ్డు రోజూ తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ భారీన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. గర్భవతులకు గుడ్డు చాలా ఆరోగ్యకరం. గుడ్డులో ఉండే ఫోలిక్ యాసిడ్, ఇనుము పుట్టబొయే బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది . 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: