మీకు కరోనా వచ్చిందో లేదో తెలుసుకునే సింపుల్ చిట్కా..?
కరోనా వచ్చిందో రాలేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి.. పరీక్షలు చేయించుకోవాలి.. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా పరీక్షలు చేయించుకోవడం అంత సులభతరంగా లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీగా రద్దీ ఉంటోంది. అందులోనూ ఇప్పుడు స్వాబ్ తీసుకుంటే ఫలితం వచ్చేందుకు కనీసం 3, 4 రోజులు సమయం తీసుకుంటున్నారు. ఈలోపు కరోనా వచ్చిన రోగికి పరిస్థితి చేజారిపోతోంది.
అందులోనూ ఇప్పుడు వస్తున్న కరోనా లో పెద్దగా లక్షణాలు కూడా కనిపించడం లేదు. దీనివల్ల చాలా మందికి కరోనా వచ్చిన విషయం కూడా తెలియడం లేదు. అయితే కొందరు నిపుణులు స్వీయ పరీక్ష ద్వారా కరోనాను అంచనా వేయవచ్చని చెబుతున్నారు. అందులో ఒక లక్షణం ఏంటంటే.. శ్వాస పీల్చుకునే వేగం పెరగడం.
అందుకే.. ఆరోగ్యంగా ఉన్న మనిషి నిమిషానికి 20 సార్లు కంటే ఎక్కువ సార్లు శ్వాస తీసుకుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని అమెరికాలోని ప్రతిష్టాత్మక సీ.డీ.సీ సభ్యుడు, చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. విజయ్ వెల్దండి చెబుతున్నారు. ఈ చిన్న పరీక్ష ఎవరైనా చేసుకోవచ్చు. స్టాప్ వాచ్ లో టైమ్ చూసుకని ఎవరికి వారు ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నారనేది పరిశీలించుకోవచ్చు.
అయితే ఈ పరీక్ష చేసుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అంతే కానీ.. అనవసరమైన ఉత్కఠకు లోనైతే శ్వాస వేగం ఆటోమేటిగ్గా పెరిగే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇది కేవలం ఓ అంచనాకు వచ్చేందుకు ఉపయోగించే చిట్కా మాత్రమే. ఇదే ఫైనల్ అనుకోవద్దు.. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. అయితే కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉన్నా భయపడవద్దంటున్నారు వైద్య నిపుణులు. కరోనా వైరస్ సోకితే సరైన మందులు తీసుకుని ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకోవచ్చని, ఖచ్చితంగా ఆసుపత్రిలోనే ఉండాల్సిందే అన్న నియమం ఏమీ లేదని చెబుతున్నారు.